ఎంపీపీ, జెడ్పీటీసీలకు గౌరవవేతనం పెంచాం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
అసెంబ్లీ
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిన తర్వాత ఎంపీపీ, జెడ్పీటీసీ లకు గౌరవ వేతనం పెంచడంతో పాటు, అభివృద్ధి నిధులను పెంచామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం శాసన మండలి లో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు పురాణం సతీశ్, శేరి సుభాష్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమాధానమిచ్చారు.
2014-15 నాటికి 7 కోట్ల 12 లక్షల నిధులు ఎంపీపీ లు, జెడ్పీటీసీ లకు అందాయని …2020-21 ఏడాదికి 274 కోట్ల 70 లక్షలు అందించామన్నారు. 2021-22 ఇప్పటివరకు 102 కోట్ల 36 లక్షలు అందజేసినట్లు మంత్రి వివరించారు. మొత్తం 423 కోట్ల 18 లక్షల రూపాయలు ఎపీపీ,జెడ్పీటీసీల అభివృద్ధి నిధులు అందిస్తున్నామని మంత్రి చెప్పారు.
అలాగే, గతంలో 2004-05 నుండి 2013-14 వరకు 10 సంవత్సరాలలో తలసరి గ్రాంటు, సీనరేజి, గౌరవ వేతనం, పన్నులు… అన్నీకలిపి ఎంపీపీలకు, జేడ్పీపీలకు కేవలం 473 కోట్లు మాత్రమే విడుదల చేశారని మంత్రి వివరించారు .15 వ ఆర్థిక సంఘం ఇచ్చే నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందచేసిందన్నారు . 2021- 22 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ నిధులు… జిల్లా ప్రజా పరిషత్తులకు 251 కోట్ల 75 లక్షల రూపాయలు, మండల ప్రజా పరిషత్తులకు 248 కోట్ల 25 లక్షల రూపాయలు గా మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
సీఎం కెసిఆర్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని 500 కోట్ల రూపాయలను జిల్లా, మండలం ప్రజా పరిషత్తులకు కేటాయించారన్నారు. ఈ నిధుల వినియోగం పై స్థానిక సంస్థల ఎమ్మెల్సీ లతో ఒక సమావేశం నిర్వహించి, విధి విధానాలను రూపొందిస్తామని చెప్పారు. ప్రతి చిన్న గ్రామ పంచాయతీ కి కూడా కనీసం 5 లక్షల రూపాయలు అందుతున్నాయని, నిధులు లేక సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారనడంలో నిజం లేదన్నారు.