సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల్లో కర్ణాటక, మహారాష్ట్ర టాప్.. ఒడిశా, బీహార్ కంటే దిగువన ఏపీ..!

సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల ఎగుమతుల్లో తెలంగాణ దేశంలోనే మూడో స్థానం సొంతం చేసుకోగా.. ఆంధ్రప్రదేశ్ 15వ స్థానానికి పరిమితమైంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభలో ఈ మేరకు వెల్లడించారు. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయనీ విషయాన్ని వెల్లడించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా, సెల్‌లలో ఉన్న సంస్థలు కలిపి రూ. 11,59,210 కోట్లు విలువైన సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను ఎగుమతి చేశాయి. కర్ణాటక రూ. 3,95,904 కోట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, మహారాష్ట్ర రూ. 2,36,808 కోట్లతో రెండో స్థానంలోను, రూ. 1,80,617 కోట్లతో తెలంగాణ మూడో స్థానంలోను నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ 0.111 శాతంతో 15వ స్థానానికి పరిమితమైనట్టు కేంద్రం వివరించింది. దీని ప్రకారం వెనుకబడిన రాష్ట్రాలైన బీహార్, ఒడిశాల కంటే ఏపీ దిగువన ఉంది. ఎస్ఐటీ, సెజ్‌లలోని యూనిట్లతో కలుపుకుని ఈ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,290 కోట్లు ఉత్పత్తులను మాత్రమే ఎగుమతి చేసింది. ఏపీ కంటే 300 శాతం అధికంగా అంటే రూ. 5,169 కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను ఒడిశా ఎగుమతి చేసింది. స్టార్టప్స్‌లో ఏపీ కంటే బీహార్ మెరుగ్గా ఉంది. 2016-2022 మధ్య దేశవ్యాప్తంగా 84,012 గుర్తింపు పొందిన స్టార్టప్‌లు ఉండగా, ఇందులో కూడా ఏపీ వాటా మరీ తక్కువగా 1.54 శాతం మాత్రమే ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా 15,571 స్టార్టప్‌లు ఉండగా, తెలంగాణలో 4,426, బీహార్‌లో 1,463 ఉండగా, ఏపీలో మాత్రం 1300 మాత్రమే ఉన్నట్టు కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాశ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *