ఏపీఎస్ఆర్టీసీలో యు టి ఎస్ విధానం అమలు : ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు
8000 బస్సులలో యు టి ఎస్ విధానం
ప్రయాణికుల సౌలభ్యం కోసం ఒకే యాప్ నందు ముందస్తు టికెట్ బుకింగ్
విజయవాడ :

యావత్ భారత దేశములోనే ప్రప్రధమముగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నూతన ఆధునిక సాంకేతికతతో (నగదు రహిత లావాదేవిలను ప్రోత్సహించుటకు) “యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్” ప్రవేశపెట్టారు. ఈ విధానములో ప్రయాణికుల సౌలభ్యం కోసం ఒకే యాప్ నందు ముందస్తు టికెట్ బుక్ చేసుకొనుట, బస్సుల ట్రాకింగ్ లభ్యత వివరములు తెలుసుకొనుట, కార్గో లేదా పార్శిల్ బుక్ చేసుకొనుట తదితర సేవలు ఈ యాప్‌లో ఉంటాయని ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు.. గ్రామీణ ప్రాంతముల వారు కూడా ముందస్తుగా బస్ టికెట్స్ కొనుగోలు చేయవచ్చువచ్చన్నారు. బస్సులోని ప్రయాణికులు సైతం నగదు ద్వారానే కాకుండా యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, వాలెట్ ల ద్వారా టికెట్లను కొనవచ్చని… క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా టికెట్స్ కొనవచ్చన్నారు. ఇప్పటి వరకు 8000 బస్సులలో ఈ యు టి ఎస్ విధానం ప్రవేశ పెట్టుట జరిగిందని ఆయన వెల్లడించారు. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటి వరకు దేశములో ఏ ఆర్టీసీ లలో లేదని… ఈ నేపధ్యములో కేంద్రప్రభుత్వ సంస్థ అయిన సి డాక్ వారు డిసెంబర్ నెలలో ఆర్టీసీ కేంద్ర కార్యాలయమును సందర్శించి ఇన్ఫార్మేషన్ టెక్నాలజీ విభాగములోని వివిధ రకముల ప్రాజెక్టులను, వాటి పనితీరును పరిశీలించి ప్రశంసించడం జరిగినదన్నారు.

అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండర్ టేకింగ్స్ సౌజన్యంతో జనవరి 5 ,6 తేదీలలో వివిధ ఆర్టీసీల నుంచి 20మంది ఉన్నతాధికారుల బృందం ఏపీఎస్ ఆర్టీసీ లో అమలు అవుతున్న యు టి ఎస్ , వివిధ రకముల ఐ.టి. ప్రాజెక్టులను, వాటి పనితీరును అధ్యయనం చేశారు. ఈ సందర్భముగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు వారికి సంస్థలో అమలు చేయుచున్న ఐటి ప్రాజెక్టులు, కార్గో, పార్శిల్ సర్వీసు , ఎలక్ట్రికల్ బస్సులు, తదితర వివరాలు తెలిపారు. యు టి ఎస్ విధానం అమలు చేసినందుకు ఐటి విభాగం అధికారులను, సిబ్బందిని ప్రశంసించారు. ఈ కార్యక్రమములో సంస్థ అధికారులు ఏ .కోటేశ్వరరావు, పి .కృష్ణమోహన్, బ్రహ్మానంద రెడ్డి, రాఘవ రెడ్డి, సుధాకర్, శ్రీనివాసరావు, తర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.