హుగ్లీనది నీటి అడుగున తొలి మెట్రో సొరంగం

కోల్‌కతా

నీటి అడుగున తొలి మెట్రో రైలు సొరంగ నిర్మాణం

దేశంలో నీటి అడుగున తొలి మెట్రో రైలు సొరంగ నిర్మాణం పశ్చిమబెంగాల్‌లో సిద్ధమవుతోంది. కోల్‌కతా ఈస్ట్‌ వెస్ట్‌ మెట్రో కారిడార్‌ కింద రూ.120 కోట్ల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది దిగువన నిర్మిస్తున్నారు.

520 మీటర్ల పొడవు ఉన్న ఈ సొరంగాన్ని 45 సెకన్లలో దాటే మెట్రో రైలు ప్రయాణికులకు వింత అనుభూతిని అందించనుంది. సొరంగ అంతర్గత అడ్డుకొలత 5.55 మీటర్లు కాగా, బాహ్య అడ్డుకొలత 6.1 మీటర్లు. లండన్‌-ప్యారిస్‌ కారిడార్‌లోని యూరోస్టార్‌ సర్వీసు మాదిరిగా రూపుదిద్దుకొంటున్న ఈ సొరంగమార్గం నదీగర్భానికి 13 మీటర్ల దిగువన, భూమట్టానికి 33 మీటర్ల దిగువన ఉంటుంది. వచ్చే ఏడాది డిసెంబరుకల్లా దీన్ని ప్రారంభిస్తారు. ‘ఈస్ట్‌ వెస్ట్‌ కారిడార్‌కు ఈ సొరంగ నిర్మాణం చాలా కీలకం. చుట్టూ ఉన్న నివాసప్రాంతాలు, కొన్ని సాంకేతిక సమస్యల దృష్ట్యా ఈ నిర్మాణం మాకున్న ఏకైక ప్రత్యామ్నాయం’ అని కోల్‌కతా మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ జీఎం (సివిల్‌) శైలేష్‌కుమార్‌ తెలిపారు. హావ్‌డా-సీల్దా నడుమ రోడ్డు ప్రయాణానికి ప్రస్తుతం గంటన్నర సమయం పడుతోందని, ఈ మెట్రో మార్గం ఏర్పాటుతో అది 40 నిమిషాలకు తగ్గుతుందన్నారు. ఈ రెండు స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ కూడా తగ్గుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *