వర్షా కాలంలో హెపటైటిస్ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది- వైద్యులు
వర్షా కాలంలో మలినమైన నీటితో పాటు బయట దొరికే ఆహారం తీసుకోవడం వలన అనారోగ్య సమస్య లు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాన కాలంలో ఎక్కువగా హెపటైటిస్ ప్రబలే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. అపరిశుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా ఈ హెపటైటిస్ వైరస్ సంక్రమించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ముఖ్యంగా చిన్నారులు, బయట తప్పని సరిగా తిరగాల్సి వచ్చే వారు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ప్రపంచంలో ప్రతి ముప్పై సెకెండ్లకు ఒకరు ఈ వ్యాధి బారిన పడి మరణిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తుండగా వర్షాకాలంలో మరింత తీవ్రమవుతుందని వైద్యులు తెలిపారు. ఈ హెపటైటిస్ పై అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ వో ) ప్రతీ ఏటా జూలై నెల 28వ తేదీని ప్రపంచ హెపటైటిస్ డే గా నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతీ ఏడాది ఒక థీమ్ ను తీసుకొని ప్రాచుర్యం కల్పిస్తుంటారు. ఈ ఏడాది (2021) కి హెపటైటిస్ కాన్ట్ వెయిట్ అనే థీమ్ ను ప్రకటించారు. అంటే.. సమాజం నుంచి హెపటైటిస్ ను నిర్మూలించాల్సిన తక్షణ ఆవశ్యకతను ఈ థీమ్ సూచిస్తుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాలలో భాగంగా రెనోవా NIGL హాస్పిటల్ గత వారం రోజులుగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు ప్రపంచ హెపటైటిస్ దినోత్సవ సందర్భంగా డా. ఆర్ వి రాఘవేంద్ర రావు, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు అండ్ లివర్ ట్రాన్సుప్లాంట్ సర్జన్ మరియు డైరక్టర్, రెనోవా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్ లివర్ డిసీజెస్ వారు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డా. రాఘవేంద్ర రావు మాట్లాడుతూ ప్రాథమికంగా హెపటైటిస్ అన్నది ఒక వైరస్ అని… ఈ వైరస్ లో ఐదు రకాలు కనిపిస్తాయి. వీటిని ఏ, బీ, సీ, డీ, ఈ అనే రకాలుగా చెప్పవచ్చన్నారు. ఇవి ఎక్కువగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంటాయన్నారు. మానవ శరీరంలోకి ప్రవేశించాక క్రమంగా లివర్ ను చేరుకొని అక్కడ ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తాయని అంతే గాకుండా శరీరంలోని అనేక ముఖ్య విధుల్లో పాలు పంచుకొనే లివర్ లో ఈ ఇన్ ఫెక్షన్ చేరటం వల్ల అనేక రకాల సమస్యలకు దారి తీస్తాయని వివరించారు.ఈ హెపటైటిస్ లలో హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అనేవి ఒకరి నుంచి ఒకరికి కలుషిత నీరు, కలుషిత ఆహారం ద్వారా సంక్రమిస్తుంటాయి, డా. రాఘవేంద్ర రావు తెలిపారు. సాధారణంగా ఇటువంటి హెపటైటిస్ ఇబ్బందులు ఉంటే కొన్ని రకాల లక్షణాలు అంటే ఒళ్లు నొప్పులు, తేలికపాటి జ్వరం, తలనొప్పి, శరీర బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. ఆ తర్వాత 2,3 రోజుల్లో పచ్చ కామెర్లు బయట పడతాయని, ఇది హెపటైటిస్ వైరస్ మూలంగా లివర్ కణజాలం దెబ్బతినటం వల్ల సంభవించే పరిణామమని చెప్పారు. చాలా సందర్బాల్లో ఈ సమస్య… శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ద్వారానే అదుపులోకి వస్తుందని అయితే కొన్ని అరుదైన సందర్భాలు అంటే ఇమ్యునిటీ తక్కువగా ఉన్న నేపధ్యంలో ఈ హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ వైరస్ ల కారణంగా లివర్ కు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడవచ్చని తెలిపారు. దీనిని ఫల్మనెంట్ హెపటైటిస్ అని పిలుస్తారని ఇటువంటి సందర్భాల్లో రోగిని ఆసుపత్రిలో చేర్చటం, ఐసీయూ లో చికిత్స చేయించటం వంటివి చేపట్టాల్సి రావచ్చని పేర్కొన్నారు.
ఇక రెండో రకం అయిన హెపటైటిస్ బీ, హెపటైటిస్ సీ రకాలను ప్రమాదకరమైనవిగా చెప్పవచ్చునని డా. రాఘవేంద్ర రావు వివరించారు. ఈ రెండు రకములు సాధారణంగా శరీర ద్రవాల మూలంగా (లాలాజలం, రక్తం వంటివి) ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంటాయని అదే విధంగా ఇన్ ఫెక్టెడ్ సిరంజీలు, నీడిల్స్ వంటివాటి ద్వారా ఇవి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే అవకాశం ఉన్నదిని తెలిపారు.చాలా మందిలో ఈ వైరస్ వ్యాపించిన తర్వాత ఎటువంటి రోగ లక్షణాలు బయట పడక పోవచ్చన్న డా. రాఘవేంద్ర రావు కొందరిలో మాత్రం తీవ్రమైన కడుపు నొప్పి, పచ్చ కామెర్లు ఏర్పడటం వంటివి చూడవచ్చన్నారు. అయితే చాలా సందర్భాలలో హెపటైటిస్ బీ, హెపటైటిస్ సీ ఇన్ ఫెక్షన్ లు సోకినా ఎటువంటి లక్షణాలు బయటపడని సమయాలలో వ్యాధి నెమ్మదిగా లివర్ లోని కణజాలాన్ని శిధిల పర్చడం వలన లివర్ లో తీవ్రమైన ఇబ్బందులకు దారి తీయవచ్చుని ఆయన వివరించారు. ఇది క్రమంగా లివర్ సిర్రోసిస్ ( అంటే లివర్ లోని కొంత కణజాలం నిర్జీవ స్థితికి చేరిపోయి సమస్యలు తెచ్చిపెట్టడం) కు దారి తీస్తుందని చెప్పారు. హెపటైటిస్ ఇన్ ఫెక్షన్ ల వల్ల లివర్ లో అవాంఛిత కణజాలం పేరుకొని పోయి కణితులుగా మారి సాధారణ కాలేయ క్యాన్సర్ లేదా హెపటో సెల్యులార్ క్యాన్సర్ కు దారి తీయవచ్చని ఆయన అన్నారు.
కడుపు పైభాగంలో నొప్పి తో పాటు బరువు తగ్గటం తో పాటూ పసిరికలు, నీళ్ల విరేచనాలు వంటి లక్షణాలు కనిపించిన సందర్భాలలో నిర్లక్ష్యం చేయకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించాలని డా. రాఘవేంద్ర రావు సూచించారు. తద్వారా సమస్యను త్వరగా గుర్తించి వెంటనే నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకొంటే హెపటైటిస్ మహమ్మారిని తరిమికొట్టవచ్చని డా. రావు అన్నారు. అందుకే ఇలాంటి వ్యాధులు సోకకుండా జాగ్రత్త పడడమే మేలని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన డా. రావు, వ్యక్తిగత శుభ్రత పాటించటం, కలుషిత నీటికి, కలుషిత ఆహారానికి దూరంగా ఉండటం తో రక్షణ పొందవచ్చని తెలిపారు. కాచి చల్లార్చిన నీటిని తాగటం ఉత్తమ మార్గమని, రక్త మార్పిడి వంటి చోట్ల జాగ్రత్త తీసుకోవటం అవసరమని సూచించారు.ఇక హెపటైటిస్ బీ వంటి వైరస్ ల నుంచి రక్షణ పొందేందుకు టీకాలు లభిస్తున్నాయని వీటిని తీసుకోవడం ద్వారా వ్యాధి నుండి రక్షణ పొందవచ్చని డా. రాఘవేంద్ర రావు తెలిపారు.