ఆరోగ్యశ్రీ పథకం అమలులో ఆరోగ్య మిత్రలే కీలకం : ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో వాడరేవు వినయ్ చంద్
‘రోగులకు ఆరోగ్య మిత్రల చిరునవ్వే ప్రథమ చికిత్స కావాలి’
‘ఆరోగ్య ఆసరా గురించి మరింత అవగాహన కల్పించాలి’
ఆరోగ్య మిత్రలకు దిశా నిర్దేశం చేసిన ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో వాడరేవు వినయ్ చంద్
అనంతపురం,
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్య శ్రీ కార్యక్రమం అమలులో ఆరోగ్య మిత్రలే కీలకం అని ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈవో వాడరేవు వినయ్ చంద్ పేర్కొన్నారు. ఆరోగ్య మిత్రలు ఎలా మసలుకోవాలో వివరిస్తూ ‘మీ’ చిరునవ్వే రోగులకు ప్రథమ చికిత్స కావాలన్నారు. వైద్యం కోసం వచ్చిన ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరించి కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అన్నా, అపరేషన్లు అన్నా సహజంగా ఉండే ఆందోళనను పోగొట్టాలన్నారు. చికిత్స పొందిన వారికి నగదు అందించే ఆరోగ్య అసరా పథకం గురించి ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యత సైతం ఆరోగ్య మిత్రలు తీసుకోవాలన్నారు. చికిత్సకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఆపరేషన్ తర్వాత ఆసరా అందించడానికి అంతే ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆపరేషన్ తర్వాత విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో పని చేయకపోతే కుటుంబం గడిచేదెలా అనే ఆందోళన ప్రజలకు కలగక కూడదనే ఉద్దేశ్యంతో ఆరోగ్య ఆసరా పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. మానవతా దృక్పథంతో చేపడుతున్న ఇంతటి గొప్ప కార్యక్రమంపై అవగాహన లేమిని తొలగించాలన్నారు. అదే సమయంలో డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లే లోపు డబ్బులు ఆసరా డబ్బులు అందేలా చూడాలన్నారు. మంగళవారం స్థానిక జెడ్పీ కార్యాలయంలోని డీపిఆర్సీ భవనంలో నిర్వహించిన ఆరోగ్య మిత్ర శిక్షణా తరగతులకు ముఖ్య అతిథిగా ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో వినయ్ చంద్ హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్ ఏ.సిరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వర్క్ షాపులో సీఈవో వినయ్ చంద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాల్లో ఆరోగ్య శ్రీ ఒకటని, ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు మరింత మెరుగులు దిద్దాలి అనుకునే పథకం ఆరోగ్యశ్రీ అన్నారు. అందుకు తగ్గట్టుగానే రెండేళ్ల కాలంలో ఆరోగ్య శ్రీ పరిధిలోకి 1100 కు పైగా నూతన చికిత్సలను తీసుకురావడం, కోవిడ్ ను సైతం ఆరోగ్య శ్రీలో చేర్చడం జరిగిందన్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఆరోగ్య శ్రీ వంటి విస్తృతమైన ఆరోగ్య బీమా పథకం లేదన్నారు. ఇతర రాష్ట్రాలలోని కార్పోరేట్ ఆసుపత్రుల్లో సైతం ఉచితంగా వైద్యం అందిస్తున్నామని, రోజు రోజుకూ కొత్త నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్య పెరుగుతూనే ఉందన్నారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు హెడ్ ఆఫీసుకి, క్షేత్ర స్థాయి సిబ్బందికి మధ్య అంతరం తగ్గించడం కోసం శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో జిల్లాలోని మొత్తం 63 మండలాల్లోనూ శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, మరో రెండు, మూడు మాసాల్లో ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే ఆసుపత్రులకు ఆటో డెబిట్(క్లియరెన్స్) స్కీం ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయని, మరిన్ని వినూత్న పద్ధతుల ద్వారా పథకానికి మెరుగులు దిద్దనున్నామన్నారు.
బ్యాంకుల విలీనం ద్వారా తలెత్తిన సమస్యలను బ్యాంకర్ల దృష్టికి తీసుకెళ్లండి
పలు బ్యాంకులు విలీనం అయిన తర్వాత ఆయా బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న వారికి చెల్లింపుల విషయంలో తలెత్తుతున్న సమస్యలను డీసీసీ మీటింగ్ లో బ్యాంకర్ల దృష్టికి తీసుకెళ్లాలని సీఈవో వినయ్ చంద్ జిల్లా ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్ కు సూచించారు. గ్రామీణ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నవారికి చేతిరాతతో అకౌంట్ నెంబరు రాసి ఉన్న బ్యాంక్ పాసు పుస్తకాలు ఉన్నాయని, ఆయా అకౌంట్లకు చెల్లింపులు చేయడంలో ఉన్న ఇబ్బందికి త్వరలో పరిష్కారం చూపనున్నామన్నారు.
కోవిడ్ కాలంలో ఆరోగ్య మిత్రలు అందించిన సేవలు వెలకట్టలేనివి
కోవిడ్ సమయంలో పని వేళలు లెక్క చేయకుండా సేవలు అందించిన ఆరోగ్య మిత్రలను సీఈవో అభినందించారు. ప్రాణాలకు తెగించి, ఒక్కోసారి నిరంతరం వస్తున్న కోవిడ్ బాధితులకోసం ఏక ధాటిగా 48 గంటలు ఆసుపత్రుల్లో ఉంటూ వారు అందించిన సేవలు వెలకట్టలేనివన్నారు.
ఆరోగ్య మిత్రల సంఖ్య పెంచుతాం: జేసీ సిరి
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సిరి మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్య మిత్రల సంఖ్యను పెంచి రాత్రి వేళల్లో అత్యవసర సేవల కోసం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరోగ్య శ్రీ కార్డు అందించేందుకు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తామన్నారు.
ఈ పథకం వల్ల ఎంత ఆర్థిక భారం పడినా సరే ఇంకా నూతన చికిత్సలు అందుబాటులోకి తీసుకురావాలి, నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్యను పెంచాలి, మరింత మెరుగైన చికిత్స అందించాలనేది ప్రభుత్వ ఆలోచన అన్నారు. అటువంటి పథకం నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆరోగ్య మిత్రలు శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకుని కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా అమలు చేయడంలో సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీదేవి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అశోక్ రెడ్డి, రామారావు, ఆరోగ్య శ్రీ జిల్లా కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ రెడ్డి, నెట్ వర్క్ ఆసుపత్రుల టీమ్ లీడర్లు, డివిజనల్ టీమ్ లీడర్లు, ఆరోగ్య మిత్రలు పాల్గొన్నారు.