సర్కారు వారి మందు.. ఏపీలో లిక్కర్ కిక్కు మామూలుగా లేదుగా..!
మద్యం అమ్మకాల్లో ఏపీ సర్కార్ రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ ఎప్పుడూ లేని విధంగా.. డిసెంబరు 31న ఒక్కరోజులోనే 142 కోట్ల మద్యాన్ని విక్రయించింది. గతంలో ఏ సంవత్సరంలోనూ ఒక్కరోజులో ఈ స్థాయి అమ్మకాలు జరగలేదు. 2021 డిసెంబరు 31న రూ. 112 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా అప్పటికి అదే అత్యధికం. కానీ ఈసారి అమ్మకాలు మరింత పెంచే లక్ష్యంతో ప్రభుత్వం సమయాన్ని ఏకంగా మూడు గంటలు పెంచి, అర్ధరాత్రి 12గంటల వరకు షాపులు తెరిచి ఉంచింది. ఆ ప్లాన్ విజయవంతమై గతేడాది కంటే రూ.30 కోట్ల అదనపు అమ్మకాలు జరిగాయి. షాపుల్లో రూ.127కోట్లు, బార్లలో రూ.15 కోట్ల మద్యం అమ్మారు. మొత్తంగా 1.54లక్షల కేసుల లిక్కర్, 72వేల కేసుల బీరు విక్రయించారు. ప్రస్తుతం రోజుకు సగటున రూ.70కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అంటే శనివారం దానికి రెట్టింపు అమ్మకాలు జరిగాయి.
