ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ బుకింగ్ కోసం ప్రభుత్వ ప్రత్యేక పోర్టల్
అమరావతి
సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవోను ఎంఎస్ నెంబర్ 35 ను విడుదల చేసింది. ‘సినిమా థియేటర్స్‌లో టికెట్స్ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. కొత్త సినిమా రిలీజ్ సమయంలో టికెట్ల ధరలను అమాంతం పెంచడం …టికెట్లను బ్లాక్ లో విక్రయించడం వల్ల ప్రజలకు వినోదం దూరమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల విక్రయించే ప్రక్రియను ప్రభుత్వం నిశితంగా గమనించేందుకు రైల్వే ఆన్‌లైన్ టికెటింగ్ సిస్టమ్ తరహాలో సినిమా పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కు అప్పగించింది. దీనికి సంబంధించిన సంబంధించిన విధి-విధానాలు, అభివృద్ధి, అమలు ప్రక్రియను ప్రభుత్వం నియమించిన కమిటీ చూసుకుంటుంది’ అని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఈ కమిటీకి ఛైర్మెన్ గా , ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కో ఛైర్మెన్ గా ఐఅండ్ పీఆర్ ,కలెక్టర్లు సభ్యులుగా వ్యవహరిస్తారని జీవో తెలిపింది.