విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలను అమలు చేస్తున్న ప్రభుత్వం_ రాష్ట్ర పాఠశాల విద్య శాఖ స్పెషల్ సి.ఎస్. బుడితి రాజశేఖర్
అమరావతి, అక్టోబరు 11
రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్న ఫలితంగా ప్రపంచ బ్యాంకు ఎటు వంటి షరతులు లేకుండా 250 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగిందని రాష్ట్ర పాఠశాల విద్య శాఖ స్పెషల్ సి.ఎస్. బుడితి రాజశేఖర్ తెలిపారు. సోమవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు పరుస్తున్న పలు విద్యా సంస్కరణలు, వాటి వల్ల విద్యార్థులకు ఒనగూరుచున్న ప్రయోజనాలను వివరించారు. రాష్ట్రంలో నాడు-నేడు పథకం క్రింద పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో నిర్వహించడం జరుగుచున్నదన్నారు. సాల్ట్ (SALT-Supporting AP Learning Transformation) ప్రాజెక్టు కింద ప్రపంచ బ్యాంకు 250 మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయాన్ని అందిస్తోందని, ఈ రుణం కోసం ప్రపంచ బ్యాంకు ఎలాంటి షరతులూ విధించలేదు అని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో పాఠశాల విద్యాశాఖలో చేపట్టిన తొలి ప్రాజెక్టు ఇదేనని ఆయన తెలిపారు. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ లాంటి విషయాల్లో ప్రపంచ బ్యాంకు షరతులు పెట్టిందనటం అవాస్తవ మన్నారు. గడచిన మూడేళ్లలో పాఠశాల విద్యాశాఖలో రూ. 53 వేల కోట్లకు పైగా వ్యయం చేశామని, అమ్మ ఒడి పథకానికి రూ.19,617 కోట్లు, నాడు నేడు తొలిదశకు రూ.3 వేల కోట్లకు పైగా వ్యయం అయ్యిందని ఆయన తెలిపారు. పాఠశాల విద్య లాంటి సామాజిక రంగంలో ఒక్కరోజులోనే ఫలితాలు ఏమీ రావనే విషయాన్ని గుర్తించాలని, క్రమంగా ఐదు, పది సంవత్సరాల్లో ఆ ఫలితాలు కనిపిస్తాయన్నారు.
2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య 40,31,239 గా నమోదైందని, కిందటి ఏడాదితో పోలిస్తే ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థలు అన్నింటినీ కలుపుకుని మొత్తం ఈసారి 86,119 మంది విద్యార్ధులు మాత్రమే తగ్గారని ఆయన స్పష్టంచేశారు. అయితే ఇందుకు కారణాలను కూడా విశ్లేషించడం జరిగిందని, ఇతర రాష్ట్రాలకు వలస పోయిన విద్యార్థులు 16 వేల 857 అని, కాలానుగుణంగా రాష్ట్రంలోనే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలసపోయిన వారు 38 వేల 951 మంది విద్యార్థులు అని, 1289 మంది విద్యార్థులు మరణించినట్లుగా గుర్తించడమైందన్నారు. అదే విధంగా రాష్ట్రంలో కూడా జనాభా పెరుగుదల తగ్గడంతో ఒకటో తరగతిలో చేరే విద్యార్థుల సంఖ్య కూడా గత విద్యా సంవత్సరంతో పోల్చు కుంటే 29 వేల 102 తగ్గినట్లు గుర్తించడమైందన్నారు. రాష్ట్రంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలసపోయిన 38 వేల 951 మంది విద్యార్థులను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించేందుకు వారి వివరాలను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించడం జరిగిందని, ఇప్పటికే దాదాపు 12 వేల మంది విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో జేర్పించడం జరిగిందని ఆయన వివరించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఆంగ్లమాద్యమంలో బోధన తో విద్యార్ధుల సంఖ్య ఏ మాత్రం తగ్గ లేదని ఆయన తెలిపారు. ఆంగ్లాన్ని నేర్పే అంశంపై త్వరలోనే అన్ని పాఠశాలలకూ ఎస్ఓపీ ని జారీ చేస్తామని, నవంబరు నెలాఖరు నాటికి 8 తరగతి చదువుతున్న 4.6 లక్షల మంది విద్యార్ధులకు ట్యాబ్ లను కూడా పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. 2025 నాటికి వీరంతా సీబీఎస్ఈ విధానంలో పరీక్షలు రాస్తారన్నారు.
రాష్ట్ర విభజన తదుపరి 2014-15 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థలు అన్నింటినీ కలుపుకుని మొత్తం 75 లక్షల 32 వేల 771 మంది విద్యార్థులు పాఠశాల విద్యను అభ్యసిస్తుండగా, ప్రస్తుత విద్యా సంవత్సరం (2022-23) లో నేటికి 71 లక్షల 59 వేల 441 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. అదే విధంగా 2015-16 విద్యా సంస్థత్సరంలో 69 లక్షల 7వేల 4 విద్యార్థులు, 2016-17 లో 68 లక్షల 48 వేల 197 విద్యార్థులు, 2017-18లో 69 లక్షల 75 వేల 526 విద్యార్థులు, 2018-19 లో 70 లక్షల 43 వేల 71 విద్యార్థులు, 2019-20 లో 72 లక్షల 43 వేల 269 విద్యార్థులు, 2020-21లో 73 లక్షల 12 వేల 852 విద్యార్థులు మరియు 2021-22లో 72 లక్షల 45 వేల 640 విద్యార్థులు పాఠశాల విద్యను అభ్యసించినట్లు ఆయన తెలిపారు. ఈ విధంగా ప్రతి ఏడాది విద్యార్థుల గణాంకాల్లో హెచ్చుతగ్గులు సహజంగా ఉన్నాయని, అయితే గత విద్యా సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది 86 వేల 199 మంది విద్యార్థుల తగ్గుదల ఉన్నట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు.
అదే విధంగా 2014-15 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 41 లక్షల 83 వేల 441 మంది విద్యార్థులు పాఠశాల విద్యను అభ్యసించగా ఆ సంఖ్య 2018-19 వరకూ తగ్గుతూ రాగ, తిరిగి 2019-20 విద్యా సంవత్సరం నుండి విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చిందని, 2021-22 విద్యా సంవత్సరంలో 44 లక్షల 29 వేల 569 విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరగా నేడు 40 లక్షల 31 వేల 239 విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారన్నారు. కోవిడ్ విపత్తు వల్ల చాలా మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలను వదిలి ప్రభుత్వ పాఠశాలలో చేరారని, ఆ విపత్తు తగ్గిపోవడం కారణంగా కొంత మంది విద్యార్థులు తిరిగి ప్రైవేటు పాఠశాలల్లో చేరడం జరిగిందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది పర్చడం వల్ల ఇంకా చాలా మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు తిరిగి వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగుతున్నారని ఆయన తెలిపారు.