మా ఊరికి మంచి నీరు ఇప్పించండి – యర్రంశెట్టివారిపాలెం మహిళలు ఆవేదన
యర్రంశెట్టివారిపాలెం సమస్యల పరిష్కారానికి జనసేన పి.ఎ.సి. ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ హామీ
తాగునీటి, వంతెన సమస్యలపై కలెక్టర్ కి వినతిపత్రం
స్పందన రాకుంటే జనసేన పార్టీ తరఫున ధర్నా
తమ ఊరికి గుక్కెడు మంచి నీరు అందటం లేదని.. జల సంపద ఉన్నా ఇంటింటికీ తాగు నీరు దొరకడం లేదని యర్రంశెట్టివారిపాలెం గ్రామ మహిళలు తమ బాధలను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి తీసుకువచ్చారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజక వర్గం పరిధిలోని యర్రంశెట్టివారిపాలెం – పెదమల్లలంక వంతెన సమస్య, తాగునీటి సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. జనసేన పార్టీ పక్షాన నిలబడిన యర్రంశెట్టివారిపాలెం గ్రామం కోసం పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులంతా కలసి కలెక్టర్ కు త్వరలో వినతిపత్రం సమర్పిస్తారని తెలిపారు. అప్పటికీ అధికారులు దిగిరాని పక్షంలో అంతా కలసి ధర్నాకు దిగుదామని, ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేద్దామన్నారు. శుక్రవారం యర్రంశెట్టివారిపాలెం వద్ద కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న వంతెనను మనోహర్ పరిశీలించారు. తాగునీటి సమస్యపై మహిళలను ఆరా తీశారు.
ఎమ్మెల్యే ఎక్కడున్నారో తెలియదు
మత్స్యకార అభ్యున్నతి యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న నాదేండ్ల మనోహర్ స్థానిక నాయకుల వినతి మేరకు యర్రంశెట్టివారిపాలెం వంతెన ప్రాంతం సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు, మహిళలు తమ సమస్యలు ఆయనకు విన్నవించుకున్నారు. సర్పంచ్, ఎంపీటీసీలుగా జనసేన అభ్యర్ధులు విజయం సాధించారన్న అక్కసుతో తాగునీరు సైతం అందకుండా చేస్తున్నారని తెలిపారు . ఇసుక మాఫియా, మట్టి మాఫియా దెబ్బకి వంతెన కూలిపోవడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారో తెలియదని స్థానికులు వాపోయారు. వినతిపత్రాలు బుట్టదాఖలవుతున్నాయని, సర్పంచ్ ని తహసీల్దార్ పట్టించుకోవడం లేదని చెప్పారు. పోలీసులను ఆశ్రయిస్తే ఎదురు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ శ్రీమతి యర్రంశెట్టి త్రివేణి తాత వినతి పత్రం అందజేశారు. యర్రంశెట్టివారిపాలెం ప్రజలకు జనసేన పార్టీ అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా మనోహర్ హామీ ఇచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ అధ్వర్యంలో సాగుతున్న ఈ పర్యటన లో పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, పార్టీ నేతలు బండారు శ్రీనివాస్, శెట్టిబత్తుల రాజబాబు, మేడా గురుదత్ ప్రసాద్, మర్రెడ్డి శ్రీనివాస్, వేగుళ్ళ లీలాకృష్ణ, శ్రీమతి మాకినీడు శేషుకుమారి, పాటంశెట్టి సూర్యచంద్ర, వై.శ్రీనివాస్, సంగిశెట్టి అశోక్ రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.