పత్రికా స్వేచ్ఛతోనే ప్రజాస్వామ్య మనుగడ

-జాతీయ పత్రికా దినోత్సవంలో వక్తల ఉద్ఘాటన

విజయవాడ, నవంబర్ 16:
ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ సాధించాలంటే పత్రిక స్వేచ్ఛ అనివార్యమని వక్తలు ఉద్దాటించారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ప్రెస్ క్లబ్ లో ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రముఖ సామాజిక విశ్లేషకుడు, విశ్రాంత ఆచార్యులు డాక్టర్ ఎంసీ దాస్ ప్రసంగిస్తూ పత్రికా స్వేచ్ఛతో పాటుగా బాధ్యతలు కూడా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రబోధిస్తుందని అన్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన జాతీయ పత్రిక దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కివక్కానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభంగా ఉన్న పత్రికా వ్యవస్థ పై గురుతరమైన బాధ్యత ఉందని చెప్పారు. సామాజిక, బడుగు, బలహీన వర్గాల ఆకాంక్షలను పత్రికలు ప్రతిబింబించాలన్నారు. ప్రభుత్వ విధానాలు ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలపై పత్రికల్లో నిర్మాణాత్మక వార్తల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. పత్రికలు వ్యక్తిగత దూషణలకు పాల్పడటం సరికాదని ఆయన హితవు పలికారు. ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ వ్యక్తులు, సంస్థలు, జర్నలిస్టులపై చేస్తున్న దాడులను నిలువరించడంలో పీసిఐ ఎంతో బాధ్యతగా చేస్తున్న కృషిని అభినందించారు. అత్యధిక సభ్యత్వం గల ఐజేయూకు, ఇతర జర్నలిస్టు సంఘాలకు భాగస్వామ్యం కల్పించబడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అర్బన్ యూనిట్ అధ్యక్షులు చావా రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, ఐజేయు కౌన్సిల్ సభ్యులు షేక్ బాబు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, కార్యదర్శి వసంత్ తదితరులు ప్రసంగించగా అర్బన్ యూనిట్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు వందన సమర్పణ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *