విజయవాడ పండిత్ నెహ్రు బస్సు స్టేషన్ వద్ద తొలి తరం “డెక్కన్ క్వీన్ “ బస్సు ఆవిష్కరణ
విజయవాడ :
నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ సంస్థ కు చెందిన తొలితరం అల్బియాన్ (డెక్కన్ క్వీన్) పాసింజర్ బస్సును విజయవాడ డిపోలో పనిచేసి రిటైరైన ఇద్దరు సీనియర్ డ్రైవర్లతో రిబ్బన్ కట్ చేయించి ఆవిష్కరింపజేశారు. అప్పటి వారి అనుభవాలను, ఈ బస్సు తాలూకు జ్ఞాపకాలను రవాణా శాఖ సెక్రటరీ ప్రద్యుమ్న , ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు తెలుసుకున్నారు.

అనంతరం ఇరువురూ తొలి తరం అల్బియాన్ (డెక్కన్ క్వీన్) పాసింజర్ బస్సు లోపలి సీటింగ్ అమరికను, కిటికీ నమూనాలను పరిశీలించారు. డ్రైవింగ్ సీటులో కూర్చుని, స్టీరింగ్ ని పట్టుకుని అటూ, ఇటూ తిప్పుతూ ఆనందించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎం.డి సిహెచ్. ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ విజయవాడ బస్సు స్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే ప్రయాణికులందరికీ, ఈ పురాతన బస్సు కనబడేలా సిటి పోర్టులో ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. బస్సు స్టేషన్ లోపల భద్రపరిస్తే ఎక్కువమంది చూసే వీలుండదని, విశాలమైన సిటీ బస్సు పోర్టులో ఉంచడం వలన ప్రతి ఒక్కరికీ కనువిందు చేస్తుందని భావించి, ఈ ప్రదేశంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి తరం ప్రజలకు, ప్రయాణికులకు తొలి తరం బస్సు విశేషతను గుర్తు చేసే విధంగా ఆర్టీసీ ఈ ఏర్పాటు చేసిందని, ఇది పర్యాటకులకు, ప్రయాణికులకు కనువిందు చేస్తుందని తెలిపారు. ఆనాటి నిజాం యువరాణి జహీరా బేగం ప్రయాణికుల కోసం ఈ బస్సుని సొంత ఖర్చులతో కొనుగోలు చేయడం వలన ఆమె పేరు లోని మొదటి అక్షరం జడ్ ని ఇప్పటికీ ప్రభుత్వ బస్సుల రిజిస్ట్రేషన్ గా చేసారని తెలిపారు.
అనంతరం రవాణా శాఖ సెక్రటరీ ప్రద్యుమ్న మాట్లాడుతూ ఆర్టీసీ తొలి తరం బస్సును ఇప్పటి వారందరికీ తెలియజేసేలా ప్రదర్శనకు ఉంచడం కొనియాడదగినదని కితాబు ఇచ్చారు. తాను కూడా ఈ బస్సుని చూసి మధుర అనుభూతికి లోనయ్యానని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి ఫోటోలు దిగి ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో పాటు సూపర్ వైజర్లు, ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు.
ప్రయాణికుల, ప్రజలకు ఆనాటి తొలి బస్సు మోడల్ ని కనులారా వీక్షించేందుకు, మధురమైన జ్ఞాపకాలుగా ఫోటోలు దిగేందుకు వీలుగా బస్సు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, బస్సు యొక్క ప్రాముఖ్యత తెలియజేసే బోర్డు సూచికను కూడా ఏర్పాటు చేసారు. ఈ తొలితరం అల్బియాన్ (డెక్కన్ క్వీన్) పాసింజర్ బస్సు కు ఎంతో చరిత్ర ఉన్నది. డెక్కన్ క్వీన్ — ఇది హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం ప్రభుత్వం వారు 1932 లో ప్రారంభించిన తొలి బస్సుకు పెట్టిన పేరు. అప్పటి రవాణ వ్యవస్థకు సాక్ష్యంగా నిలిచిన ఏకైక బస్సు ఇది. నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ సంస్థ ఈ డెక్కన్ క్వీన్, అల్బియాన్ పాసింజర్ బస్సుని రూపొందించింది. ఈ బస్సు NSR-RTD యొక్క వారసత్వ ఆస్తి. కేవలం 3 డిపోలు, 27 బస్సులతో 166 మంది కార్మికులతో 1932 లో నిజాం రాష్ట్ర రైల్వే రోడ్డు రవాణా సంస్థ ఏర్పడింది. దానిలో భాగంగా 1932 లో 27 అల్బియాన్ బస్సులను నిజాం రాష్ట్రం మీదుగా నడిపింది. లండన్ నుండి దిగుమతి కాబడిన ఈ బస్సులు 1970 వరకూ హైదరాబాద్ ప్రాంత పరిధిలో 400 కిలోమీటర్ల వరకూ నడపబడ్డాయి.

నిజాం యువరాణి జహీరా బేగం ఆలోచన మేరకు ఈ డక్కన్ క్వీన్ బస్సును ఏర్పాటు చేశారు. నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి నార్కట్ పల్లి వరకు నడిచి వెళ్తున్న ప్రజలను చూసి చలించిన యువరాణి రూ. 3.71 లక్షలను పెట్టుబడిగా పెట్టి బస్సు సర్వీసును ఏర్పాటు చేశారు. అప్పటి హైదరాబాద్ రాజ్యానికి ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న అక్బర్ హైదరి రాజు చొరవ తీసుకుని 27 బస్సులను లండన్ నుండి కొనుగోలు చేయగా అక్కడి నుండి బొంబాయికి షిప్ ద్వారా, అనంతరం బొంబాయి నుండి హైదరాబాద్ కు రోడ్డు మార్గం ద్వారా 27 రోజుల్లో తీసుకువచ్చి కాచిగూడ, నార్కట్ పల్లి, కాజీపేట అనే 3డిపోలు ఏర్పాటు చేసి అందజేశారు. మొదటి డక్కన్ క్వీన్ బస్సును చార్మినార్ నుండి రాణి గంజ్ రూట్లో నడిపారు. నిజాం యువరాణి సేవకు గుర్తుగా అప్పటి నుండి ఆమె పేరు లోని మొదటి అక్షరం Z ను బస్సులకు రిజిస్ట్రేషన్ నెంబర్ గా మార్చారు. 19 మంది ప్రయాణికులు ప్రయాణం చేసేలా, అల్బియన్ మోటార్స్ కంపెనీ ఈ బస్సును తయారు చేసింది. మూసివేయడానికి అనువుగా ఉండే సింగిల్ డోర్ తో ఈ బస్సు ఏర్పాటు చేయబడింది. తొలిసారిగా రవాణా సౌకర్యం కల్పించబడి ప్రయాణికులకు మధురానుభూతిని కలిగించిన బస్సు డెక్కన్ క్వీన్. 1990 సెప్టెంబర్ లో ఈ బస్సును విజయవాడ పి.ఎన్.బి.ఎస్.కి మార్చారు. అలాంటి ఘనత సాధించిన బస్సును ప్రజల/ప్రయాణికుల సందర్శన కోసం ఉంచాలనే గొప్ప నిర్ణయాన్ని ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. తీసుకుంది. ఈ మహత్కార్యానికి ఎం.డి సి.హెచ్. ద్వారకా తిరుమల రావు శ్రీకారం చుట్టారు. అది ఈ రోజు సాకారమైనది.
ప్రస్తుతం ఇలాంటి బస్సులు 2 మాత్రమే ఉండగా, వాటిలో ఒకటి హైదరాబాద్ ఆర్టీసీ హెడ్ క్వార్టర్స్ నందు కలదు. విజయవాడ మీదుగా చాలా మంది ప్రయాణికులు వివిధ రాష్ట్రాలకు, ప్రాంతాలకు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. అలనాటి బస్సు వైభవాన్ని గుర్తుకు తెచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించి విజయవాడకు తరలించారు. “ఇది ఆర్టీసీ చరిత్రకు సాక్ష్యం, భవిష్యత్తు తరాల కోసం దీన్ని భద్రపరచి,” ప్రయాణికులను ఆకట్టుకునేలా ప్రదర్శించాలనే ఉద్దేశ్యంతో సంస్థ ఎం.డి సి.హెచ్. ద్వారకా తిరుమల రావు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ డెక్కన్ క్వీన్ బస్సును పి.ఎన్.బి.ఎస్. సిటీ బస్ టెర్మినల్ వద్ద ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1952 లో ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. గా ఆవిర్భవించి, ప్రపంచంలోనే అతి పెద్ద రోడ్డు రవాణా సంస్థగా పేరుగాంచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు సాధించడమే కాకుండా ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా సొంతం చేసుకొంది. ప్రయాణికుల అభిరుచి మేరకు 1932 నుండి ఇప్పటివరకు వివిధ రకాల బస్సులను ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. అందుబాటులోకి తీసుకొని వచ్చింది.ఆ కోవలోనే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సూపర్ లగ్జరీ, డీలక్స్, అల్ట్రా డీలక్స్, ఇంద్ర, అమరావతి, వెన్నెల, స్టార్ లైనర్ (నాన్ ఏ.సి. స్లీపర్) తదితర బస్సులు ప్రయాణికుల అభిరుచి మేరకు ఈ 91 సంవత్సరాలలో అనేక సౌకర్యాలతో రూపాంతరం చెందాయి. కాలం మారినా అప్పటి జ్ఞాపకాలు మరచిపోకూదడనే ముఖ్య ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఈ డెక్కన్ క్వీన్ బస్సు చూపరులకు ఈ రోజు నుండి కనువిందు చేయనుంది.
ఆనాటి మధుర జ్ఞాపకాలను ప్రయాణికులందరికీ కూడా పంచాలనేదే ఆర్టీసీ ముఖ్య ఉద్దేశ్యం.