ఏపీ, తెలంగాణలో ఓటర్ల తుది జాబితా విడుదల
ఏపీలో 3,99,84,868 మంది ఓటర్లు
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,99,92,941
అమరావతి : కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో 2,99,92,941మంది, ఏపీలో 3,99,84,868 మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణ, ఏపీలో తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈసీ వెల్లడించిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,99,92,941కి చేరింది. ఇందులో ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 2,740 మంది, సర్వీసు ఓటర్లు 15,282 మంది ఉన్నారు. మొదటి సారి ఓటు హక్కు పొందిన 18 నుంచి 19ఏళ్ల మధ్య యువత 2,78,650 మంది ఉన్నట్టు జాబితాలో పేర్కొన్నారు. ఓటర్ల తుది జాబితా ప్రకారం హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల సంఖ్య 42,15,456కి చేరింది. రంగారెడ్డి జిల్లాలో ఓటర్ల సంఖ్య 31,08,068కి చేరింది. మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లాలో 25,24,951 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 6,44,072 మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. 1,42,813 మంది ఓటర్లతో అత్యల్ప ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా భద్రాచలం నిలిచింది. ప్రతి యేటా ఓటర్ల జాబితా సవరణ తర్వాత జనవరి నెలలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రకటిస్తుంది. అందులో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గురువారం ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో2023 జనవరి 5వ తేదీ నాటికి ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,84,868కి చేరింది. ఇందులో మహిళా ఓటర్లు 2,02,19,104 మంది, పురుష ఓటర్లు 2,01,32,271 మంది ఉన్నారు. రాష్ట్రంలో సర్వీసు ఓటర్లు 68,182 మంది ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఈమేరకు ఏపీలోని ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా గురువారం విడుదల చేశారు.

నవంబరు ముసాయిదా జాబితాతో పోలిస్తే తొలగింపులు చేరికల తర్వాత 1,30,728 మంది ఓటర్లు పెరిగినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వెల్లడించారు.