కృష్ణా పరీవాహక ప్రాంతానికీ వరద ప్రమాదం
హైదరాబాద్
మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో విపరీతంగా వానలు కురుస్తున్నవి. మహాబలేశ్వరం లో 70 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితుల్లో ఎగువ రాష్ర్ట్రాలనుంచి కృష్ణా పరీవాహక ప్రాంతంలో వరద పెరిగే పరిస్థితులు ఏర్పాడ్డాయి. రాష్ట్రంలోని కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో తక్షణమే రక్షణ చర్యలు చేపట్టేందుకు సిద్దంగా వుండాలి’’ అని సీఎం కెసిఆర్ స్పష్టం చేశారు. అందుకుగాను నాగార్జున సాగర్ కేంద్రంగా ఉన్నతాధికారులను పంపించాలన్నారు. రేపటి నుంచి నల్లగొండ ఇరిగేషన్ సీఈని నాగార్జున సాగర్ డ్యాం పర్యవేక్షణ కోసం., వనపర్తి సీఈని జూరాల ప్రాజెక్టు పర్యవేక్షనలో వుండాలన్నారు.
తక్షణ రక్షణ చర్యలకై ఏర్పాట్లు :
వరదలనుంచి ప్రజలను రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలకై మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను రప్పించాలని, హెలికాప్టర్ లను మరిన్ని తెప్పించాలని సిఎస్ ఆదేశించారు. గతం లో వరద పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కున్నసీనియర్, రిటైర్డ్ అధికారులను రేపటినుంచి పిలిపించుకుని ఆపత్కాలంలో వినియోగించుకోవాలన్నారు. రేపు ఎల్లుండి కొనసాగే వరద పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, పోలీస్, ఆర్ అండ్ బీ రెవిన్యూ,పంచాయితీ రాజ్ మున్సిపల్ శాఖలు పూర్తి సంసిద్దతతో వుండాలన్నారు.
తక్షణమే లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించి రక్షణ చర్యలు చేపట్టాలని. గంట గంటకు వరద పరిస్థితిని అంచనావేస్తూ, రిజర్వాయర్ లు ప్రాజెక్ట్ ల నుండి నీటిని నియంత్రిస్తూ వదలాలని సిఎం ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
హైద్రాబాద్ పరిస్థితి ఏంటి ?
మూసీ నది వరద గురించి ఈ సందర్భంగా సిఎం ఆరా తీసారు. వరద ఉదృతి పెరిగే పరిస్థితిని అంచనా మూసి లోతట్టు లో నివాసం వుంటున్న ప్రజల రక్షణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. డ్రైనేజీ పరిస్థితుల మీద ఆరా తీసిన సీఎం, తక్షణమే అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇండ్ల నిర్మాణాలపై కటినంగా వ్యవహరించాలని, హెచ్ ఎం డిఎ, జీ హెచ్ ఏం సీ అధికారులకు సీఎం స్పష్టం చేశారు.
అగస్టు 10 దాకా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :
అగస్టు 10 దాకా వర్షాలు కొనసాగే పరిస్థితి వున్నదని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో, ప్రజా రక్షణకోసం అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఆర్ అండ్ బీ శాఖ వరద పరిస్థితులను ముందుగానే అంచనావేసి అన్ని ఇతర శాఖలతో సమన్వయం అవుతూ…బ్రిడ్జీలు రోడ్లు పరిస్థితులను పరిశీలించి ప్రజా రవాణా వ్యవస్థను కంట్రోల్ చేసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కృష్ణా గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని మంత్రులు ఎమ్మెల్యేలు సహా గ్రామస్థాయినుంచి అందరు ప్రజాప్రతినిధులను ఇప్పటికే అప్రమత్తం చేశామని సిఎం తెలిపారు.
వరదలతో సాహస కృత్యాలు వద్దు :
భారీ వర్షాల నేపథ్యంలో వరదలు ఉధృతమౌతున్న పరిస్థితుల్లో, రాష్ట్ర ప్రజలు కూడా జాగ్రత్తగా వుండాలని స్వీయ నియంత్రణ పాటిస్తూ వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిఎం సూచించారు. వాగులు వంకలు చెరువులు కుంటల వైపు సంచారం కూడదని, వరదల్లో చిక్కుకోకుండా ఉండాలని హెచ్చరించారు. వరద ఉదృతిలో వాగులు వంకలు దాటేందుకు సాహసకృత్యాలకు పాల్పడకుండా ఉండాలని హితవు పలికారు. కుటుంబ పెద్దలు కుటుంబ సభ్యులను పిల్లలను వరదల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం కెసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.