ఆస్పత్రుల్లో ప్రతి పరికరం పనిచేయాలి:వైద్యాధికారులకు మంత్రి విడదల రజిని ఆదేశాలు
పర్యవేక్షణకు డ్యాష్ బోర్డు ఏర్పాటుచేయండి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యాల మేరకు పనిచేయాలి
ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చాల్సిన బాధత్య అధికారులదే
సహజ కాన్పులు పెరిగేలా చొరవచూపండి
కాన్పుల కోసం ఆపరేషన్లు ఎక్కువ చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులను గుర్తించండి
నోడల్ ఆఫీసర్లు జిల్లాలకు వెళ్లాలి
టెలీకన్సల్టేషన్‌పై ప్రజల్లో అవగాహన పెంచండి
జిల్లాల్లో ప్రత్యేకంగా గుర్తిస్తున్న రోగాలపై నివేదికలు రూపొందించండి
రక్తహీనతతో బాధపడుతున్న మహిళలపై ప్రత్యేక శ్రద్ధ చూపండి
వైద్యాధికారులకు మంత్రి విడదల రజిని ఆదేశాలు
నేషనల్ హెల్త్ మిషన్ అధికారులతో సమీక్ష
గుంటూరు : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న ప్రతి వైద్య పరికరం పనిచేయాలని, వీటి పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఆదేశాలు జారీచేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ విభాగానికి సంబంధించి రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులతో మంత్రి విడదల రజిని బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ వైద్య పరికరాల నిర్వహణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎంతో ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరాలంటే ఆ పరికరాలన్నీ పనిచేసేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, వీటిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగం స్వరూపాన్ని జగనన్న పూర్తిగా మార్చేస్తున్నారని, దేశం మొత్తం మన గురించి గొప్పగా మాట్లాడుకునేలా ఈ రంగాన్ని తీర్చిదిద్దారని కొనియాడారు. జగనన్న ఆశయాల సాధనలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సహజకాన్పులు జరిగేలా చొరవచూపాలని చెప్పారు. అందుకోసం అవసరమైతే గర్భిణి స్త్రీలకు ప్రత్యేక యోగాసనాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. హెల్త్ క్లినిక్‌లలోని సీహెచ్‌వోల ద్వారా గర్భిణిలకు యోగాసనాలపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సర్జరీల ద్వారా ఎక్కువగా కాన్పులు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు ఏమున్నాయో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించాలని చెప్పారు. తదనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని ఆస్పత్రుల్లో బాలింతలు బిడ్డలకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేక గదులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందే
ఎన్ హెచ్ ఎం కింద అమలవుతున్న అన్ని కార్యక్రమాలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి నోడల్ అధికారులందరూ తప్పకుండా అన్ని జిల్లాలకు పర్యటనలకు వెళ్లాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో కార్యక్రమాల అమలుపై రాష్ట్ర స్థాయి అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. పర్యటలనకు వెళ్లిన సమయంలో ఆయా అధికారులు ఎన్ హెచ్ ఎంకు సంబంధించిన అన్ని కార్యక్రమాలపై ఆరా తీయాలన్నారు. కౌమార దశలో ఉన్న బాలికల్లో హిమోగ్లోబిన్ స్థాయిలపై ప్రతి మూడు నెలలకు ఒక సారి పరీక్షలు నిర్వహించాలని, రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా నమోదవుతున్న అమ్మాయిల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి సమస్యను పరిష్కరించాలని సూచించారు.
ముఖ్యమంత్రి జగనన్న ఆశయాల మేరకు పనిచేయాలి
వైద్య ఆరోగ్య శాఖ కోసం జగనన్న వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరేలా పనిచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లోని అన్ని విభాగాల సిబ్బందికి ప్రభుత్వం ప్రత్యేక శిక్షణలు ఇస్తూనే ఉన్నదని, ఆయా శిక్షణలకు సంబంధించిన వీడియోలు కూడా తీసి, సిబ్బందికి పంపాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా టెలీ కన్సల్టేషన్, ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య విధానాలను తీసుకొచ్చి అమలు చేస్తున్నదని తెలిపారు. వీటిపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. వాలంటీర్ల ద్వారా ఆయా విధానాలకు సంబంధించిన కరపత్రాలు ఇంటింటికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో ప్రత్యేకంగా నమోదవుతున్న రోగాలపై ఎప్పటికప్పుడు డీఎంఅండ్ హెచ్‌వోలు ప్రత్యేకంగా నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి పంపాలని, తద్వారా వెనువెంటనే చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. ఆయోడిన్ లోపం, సికిల్‌సెల్ అనీమియా, థలసేమియా, రక్తహీనత లాంటి రోగాల విషయంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆయా జబ్బులతో బాధపడుతున్న వారందరి వివరాలు తీసుకోవాలని, నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గిరిజిన ప్రాంతాల్లోని అన్ని ఆస్పత్రుల్లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ తదితర సౌకర్యాలను పీపీపీ పద్ధతిన సమకూర్చే అవకాశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. ఈ సేవలకు గాను ఆరోగ్యశ్రీ ద్వారా నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
యూపీహెచ్‌సీల పనితీరు భేష్
రాష్ట్రంలోని అన్ని యూపీహెచ్‌సీలను జగనన్న తీర్చిదిద్దారని మంత్రి తెలిపారు. వైద్య పరీక్షలను పెంచారని చెప్పారు. మందుల సంఖ్యను కూడా గణనీయంగా పెంచిన ఘనత జగనన్నదేనన్నారు. వైద్య సిబ్బందిని కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూపీహెచ్‌సీలు మంచి పనితీరు కనబరుస్తున్నాయని ప్రశంసించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్, ఎన్‌హెచ్ ఎం మిషన్ డైరెక్టర్ జె.నివాస్, ఎన్ హెచ్ ఎం ఎస్‌పీఎం డాక్టర్ రవికిరణ్, డీహెచ్ రామిరెడ్డి, రాష్ట్రస్థాయి నోడల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.