గూగుల్ వచ్చినా గురువుకు సాటి రాలేదు – ముప్పవరపు వెంకయ్యనాయుడు
• భాషను కోల్పోతే శ్వాసను కోల్పోయినట్లే
• గూగుల్ సమాచారాన్ని మాత్రమే ఇస్తుంది, గురువులు జ్ఞానంతో పాటు వివేకాన్ని ప్రసాదిస్తారు
• శ్రీ రేవూరి అనంతపద్మనాభరావు గారికి, శ్రీపోలూరి హనుమజ్జానకీ రామశర్మ అవార్డు ప్రదానం చేసిన శ్రీ వెంకయ్యనాయుడు
• హైదరాబాద్ తెలంగాణ సారస్వత పరిషత్ లో జరిగిన కార్యక్రమానికి హాజరైన పలువురు సాహితీ ప్రముఖులు
• ఇదే వేదిక నుంచి ఆచార్య దేవోభవ పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
• గురువు ప్రాధాన్యతను ముందు తరాలకు తెలియజేసేందుకే ఈ అవార్డును తమ గురువు గారి పేరిట ఏర్పాటు చేశామన్న వెంకయ్యనాయుడు
• మన సంస్కృతిని ముందు తరాలకు తెలియజేసే వారధి మాతృభాషే
• మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భాషను నేర్పించే వినూత్న పద్ధతులు రావాలి
హైదరాబాద్, 13 అక్టోబర్ 2022
గూగుల్ వచ్చినా గురువుకు ఏ మాత్రం సాటి రాలేదని, గూగుల్ అందించే కేవలం సమాచారం మాత్రమేనని కానీ గురువులు మాత్రమే విజ్ఞానంతో పాటు, ఆ విజ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవాలన్న వివేకాన్ని (విజ్ డమ్) ప్రసాదిస్తారని గౌరవ భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తనకు జీవితంలో లభించిన అలాంటి ఉన్నతమైన గురువుగా పోలూరి హనుమజ్జానకీ రామశర్మ గారి స్థానం తమ మనసులో పదిలంగా నిలిచిందని, అందుకే తన పేరున ఏర్పాటు చేస్తామన్న అవార్డును, గురువుల గొప్పతనాన్ని ముందు తరాలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే జానకీరామశర్మ గారి పేరిట ఏర్పాటు చేయించినట్లు తెలిపారు.
తెలుగు భాషా, సాహిత్యాల ఉన్నతికి కృషి చేసిన వారికి ఇవ్వాలన్న సంకల్పంతో ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలంగాణ సారస్వత పరిషత్ ద్వారా ఏర్పాటు చేయించిన పోలూరి హనుమజ్జానకీ రామశర్మ పురస్కారాన్ని, ప్రముఖ రచయిత, దూరదర్శన పూర్వ సహాయ డైరక్టర్ జనరల్ రేవూరి అనంత పద్మనాభరావుకి అందజేశారు. హైదరాబాద్, తెలంగాణ సారస్వత పరిషత్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సాహితీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ పురస్కారానికి జానకీరామశర్మ గారి జయంతి రూపంలో సందర్భ శుద్ధి, తెలంగాణ సారస్వత పరిషత్ సంకల్పంలో చిత్తశుద్ధి, రేవూరి పద్మనాభరావు రూపంలో వ్యక్తిశుద్ధి కలిగాయన్న వెంకయ్యనాయుడు, నిత్యవిద్యార్థిగా నేటికీ తమ పరిశోధనలు కొనసాగిస్తున్న పద్మనాభరావు గారు, జానకీరామశర్మ ప్రియశిష్యుల్లో ఒకరని, అలాంటి వ్యక్తికి మరో శిష్యుడు అవార్డు ప్రదానం చేయడం ద్వారా జానకీరామశర్మ ఆనందపడతారని తెలిపారు. ఈ సందర్భంగా అనంత పద్మనాభరావుకి శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, తెలంగాణ సారస్వత పరిషత్ సంకల్పాన్ని అభినందించారు. ఇదే వేదిక నుంచి పోలూరి హనుమజ్జానకీ రామశర్మ గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పించారు.
తమ గురువుగారైన పోలూరి హనుమజ్జానకీరామశర్మ గారు సాక్షాత్తు పుంభావ సర్వస్వతి స్వరూపమని పేర్కొన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు , ఈ అవార్డు వెనుక ప్రధాన ఉద్దేశం తమ గురువు గారి స్ఫూర్తిని ముందు తరాలకు తెలియజేయడమేనని తెలిపారు. జీవితంలో ఇది తనకు అత్యంత ఆనందాన్ని ఇచ్చిన సందర్భమన్న ఆయన, మనకు సద్బుద్ధిని ప్రసాదించి, సదాలోచనను కలిగించి, మనం సత్ప్రవర్తన ద్వారా, సదాచారాన్ని ఆచరిస్తూ, సన్మార్గంలో నడిచేలా మార్గనిర్దేశం చేసే గురువును ఎవరూ మరువరాదని సూచించారు.
నెల్లూరుకు చెందిన సాహితీ మణిదీపాల్లో జానకీరామ శర్మ గారు ఒకరన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, మంచి కంఠం, మంచి రూపం, చక్కని ఆహార్యంతో పాటు గురువులకు కావలసిన అన్ని లక్షణాలను మూర్తీభవించిన వారు, సంప్రదాయబద్ధమైన పంచెకట్టు, చక్కని బొట్టు, దేదీప్యమానమైన పండిత వర్చస్సుతో, గంభీరమైన రూపంతో ఇట్టే ఆకర్షిస్తారని తెలిపారు. అలాంటి మహనీయులు స్ఫూర్తితో భాషా, సంస్కృతులను కాపాడుకోవలసిన అవసరాన్ని నొక్కి చెప్పిన వెంకయ్యనాయుడు, తెలుగు మాత్రమే కాదు, ప్రతి మాతృభాష ముందు తరాలకు అందాలన్న తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. భాషను కోల్పోతే శ్వాసను కోల్పోయినట్లే అన్న ఆయన, మాతృభాషను కాపాడుకోవటానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని సూచించారు.
మన సంస్కృతిని ముందు తరాలకు తెలియజేసే చక్కని వారధి మన భాషే అనే సత్యాన్ని మనం గుర్తించాలన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, భాషను కాపాడుకుంటే చాలు… అందులోని సాహిత్యం ద్వారా సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం ముందు తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలన్న ఆయన, పిల్లలకు మన భాషలోని సాహిత్యాన్ని, మనదైన సంస్కృతిని పరిచయం చేయాలని, వారిని మనవైన మంచి విలువలతో తీర్చిదిద్దాలని సూచించారు. తెలంగాణ సారస్వత పరిషత్ లాంటి సంస్థలు చొరవ తీసుకుని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తెలుగు భాషను నేర్పించే వినూత్న పద్ధతులు మీద దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
ఇదే వేదిక నుంచి అనంత పద్మనాభరావు రచన అయిన ఆచార్య దేవో భవ పుస్తకాన్ని ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో పోలూరి హనుమజ్జానకీరామ శర్మ గారి గురువైన పింగళి లక్ష్మీ కాంతం మొదలుకుని నిన్న మొన్నటి వరకూ వివిధ విశ్వవిద్యాలయాల్లో తెలుగు ఆచార్యులుగా పని చేసిన 160 మంది జీవన రేఖలకు చోటు కల్పించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత, పురస్కార గ్రహీత అయిన రేవూరి అనంతపద్మనాభరావు గారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి జె.చెన్నయ్య, శాంతా బయోటెక్ వ్యవస్థాపకు వరప్రసాద్ రెడ్డి సహా పలువు సాహితీవేత్తలు, భాషాభిమానులు పాల్గొన్నారు.