విద్యాపరంగా రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టాలి: విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

పాఠ్యాంశ సంస్కరణలపై చర్చా సమావేశం

21 నుండి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ

విజయవాడ : విద్యా సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్నారని, దీనికోసం ప్రతి ఒక్కరూ క్రషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.


గురువారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో ‘ఎస్సీఈఆర్టీ, ఎన్సీఈఆర్టీ సంయుక్త పాఠ్య పుస్తకాల ప్రచురణ ప్రతిపాదన’ అంశంపై చర్చా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ముఖ్య అతిథిగా, జేఎన్టీయూ మాజీ వైస్ ఛాన్సలర్, ఏపీపీఎస్సీ విశ్రాంత చైర్మన్ వెంకటరామిరెడ్డి అధ్యక్షునిగా వ్యవహరించారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్, ఈ సమావేశంలో భాగంగా అభిప్రాయ సేకరణ కోసం విద్యావేత్తలను, ఉపాధ్యాయులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 21 నుండి 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్ అప్ లోడ్ ట్యాబులు పంపిణీ చేయడం జరుగుతుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. విద్యార్థులను ప్రపంచపౌరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ దిశగా ప్రభుత్వం వివిధ పథకాలు, విద్యా సంస్కరణలు అమలు చేస్తోందని తెలిపారు.
అనంతరం పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ ఎస్సీఈఆర్టీ 1 నుండి 10 తరగతుల వరకు పాఠ్య పుస్తకాలకు సంబంధించి 376 శీర్షికలతో పాఠ్య పుస్తకాలు 2020లో ప్రచురించిందన్నారు. గత రెండేళ్లుగా 23 శీర్షికలతో పాఠ్య పుస్తకాలు 8,9 తరగతులకు ఎస్సీఈఆర్టీ, ఎన్సీఈఆర్టీ సంయుక్తంగా ప్రచురించాయని తెలిపారు. 1 నుంచి 7 తరగతుల వరకు గణితం, ఇంగ్లీషు 6, 7 తరగతులకు సైన్స్ మొత్తం 26 పాఠ్య పుస్తకాల ప్రచురణకు ప్రతిపాదించడమైనదని అన్నారు. 2020-21 నుండి దశల వారీగా పాఠశాలలను సీబీఎస్ఈతో అనుసంధానం చేయడం వల్ల 8,9 తరగతుల పాఠాలను ముందు తరగతి పాఠ్యాంశాలకు అనుసరిస్తూ విద్యార్థులకు సులభంగా అవగాహన చేసుకునే విధానం గురించి వివిధ చర్చలు జరిపారు. దీనివల్ల ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలకు సంబంధించి పుస్తక వనరులు, ఉపాధ్యాయ కరదీపికలు, స్టడీ మెటీరియల్, క్వశ్చన్ బ్యాంకు, ఇ-కంటెంట్ ఎక్కువగా లభిస్తాయని, ఇవి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎంతో ఉపయుక్తకరంగా ఉంటాయని అభిప్రాయ పడ్డారు.

త్రికరణ శుద్ధిగా స్వీకరించాలి

ఈ సందర్భంగా జేఎన్టీయూ మాజీ వైస్ ఛాన్సలర్, ఏపీపీఎస్సీ విశ్రాంత చైర్మన్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి విధానాన్ని విద్యార్థులకు ఎంతో ఉపయోగరంగా ఉంటాయని, ఉపాధ్యాయులు దీనిని త్రికరణ శుద్ధిగా స్వీకరించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. సమావేశానికి హాజరైన విద్యా ప్రముఖులు ఈ విధానాన్ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా అదనపు రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు, సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పి.పార్వతి, సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి. ప్రతాప్ రెడ్డి, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు దేవానందరెడ్డి, ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ప్రచురణ సంచాలకులు రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అమరజీవికి నివాళులు

ఈ కార్యక్రమానికి ముందుగా అతిథులు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *