రెనోవా సౌమ్య క్యాన్సర్ కేంద్రం లో చికిత్స పొంది క్యాన్సర్ వ్యాధిపై పోరాడి గెలుపొందిన క్యాన్సర్ యోధులైను సన్మానించిన వైద్యులు
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంను పురస్కరించుకుని సికింద్రాబాద్ కార్ఖానాలోని రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్ లో క్యాన్సర్ వ్యాధితో పోరాడి గెలిచిన యోధులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా డైరెక్టర్ , మెడికల్ అంకాలజీ విభాగపు అధిపతి డా. పాలంకి సత్య దత్తాత్రేయ,, మాట్లాడుతూ ప్రతి ఏటా ఫిబ్రవరి 4 వ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంను నిర్వహిస్తారని వివరించారు. ఈ సంవత్సరం ధనిక-పేద, కులం, మతం, ప్రాంతం, మహిళ-పురుషుల, గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరికీ చికిత్స అందించాలనే నినాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అందరికీ, అన్ని ప్రాంతాలలో నివసించే వారికి క్యాన్సర్ చికిత్స అవసరమైతే అందించగలగడమే లక్ష్యంగా పని చేయాలనేది లక్ష్యమని అన్నారు. ఈ దిశగా రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్ పని చేస్తున్నారన్నారు .
అనంతరం కార్యక్రమంలో రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్ ఛైర్మన్ డా. సింహాద్రి చంద్ర శేఖర రావు మాట్లాడుతూ క్యాన్సర్ పై అవగాహన లేకుండా ఎందరో ఈ భయంకర వ్యాధి బారిన పడి చనిపోతున్నారని తెలిపారు. ముఖ్యంగా పొగాకు పదార్థములు తీసుకొనడం వలన భారత దేశంలో ఎక్కువ శాతం మంది క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారని వివరించారు. దీంతో పాటూ రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ లు మహిళలలో ఎక్కువగా గమనిస్తున్నామని అన్నారు. క్యాన్సర్ ను ఎంత త్వరగా అంటే మొదటి దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని …అయితే దీనిపై సరైన అవగాహన లేక వ్యాధి ముదిరిన తర్వాత చికిత్సకు వచ్చి ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ వ్యాధిపై అవగాహన కలిపించడం ఎంతో అవసరమని అయితే అవగాహన కలిపించే సందర్భంలో భయాన్ని వ్యాప్తి చేయకూడదని సూచించారు. భయం వల్ల పలువురు ఆందోళనకు గురవుతారని అదే అవగాహన కలిపిస్తే ధైర్యంగా వ్యాధితో పోరాడుతారని ఈ దిశగా కృషి చేయాలని అన్నారు.
అనంతరం రెనోవా సౌమ్య క్యాన్సర్ కేంద్రం లో చికిత్స పొంది క్యాన్సర్ వ్యాధిపై పోరాడి గెలుపొందిన క్యాన్సర్ యోధులైన మనోహర్, కొలరెక్టం క్యాన్సర్ విజేత – రఘురామ రెడ్డి, ప్రోస్టేట్ క్యాన్సర్ విజేత – శ్రీమతి దుర్గా గోపాల్, రొమ్ము క్యాన్సర్ విజేతలకు వైద్యులు సన్మానం చేశారు. సన్మానం స్వీకరించిన అనంతరం వీరు తమ అనుభవాలను పంచుకున్నారు.
ముందుగా శ్రీమతి దుర్గా గోపాల్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి సోకిందని వినగానే ఎంతగానో ఆందోళన చెందానని అయితే తదుపరి తనకు తాను తమాయించుకొని వైద్యులను సంప్రదించానని చెప్పారు. పరీక్షలు నిర్వహించిన తర్వాత వైద్యులు తనకు 4 వ స్టేజి క్యాన్సర్ అని తెలిపారని పూర్తిగా నయం అవుతుందన్న భరసా ఇవ్వమని తెలపడం జరిగిందని వివరించారు. అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా వైద్యుల సలహా సూచనల మేరకు కీమోథెరపీ, శస్త్ర చికిత్స లాంటి చికిత్సలు అందుకొని పోరాడానని వ్యాధి తగ్గిందని చెప్పారని చెప్పారు. అయితే క్యాన్సర్ ఒక సారి వచ్చిన తర్వాత మరల రాదన్న గ్యారంటీ లేదన్న విషయాన్ని అందరు పేషెంట్లు గుర్తుంచుకోవాలని వైద్యులు ముందుగానే వివరించారని అలానే తనకు మరో మారు క్యాన్సర్ వచ్చిందని తెలిపారు. అయినప్పటికీ ధైర్యంగా చికిత్స తీసుకున్నానని ఇపుడు పూర్తిగా వ్యాధి నయం అయిందని అన్నారు. తన అనుభవం ద్వారా తాను ఇతర పేషెంట్లకు మార్గదర్శకత్వం చేస్తుంటానని వారందరికీ తాను చెప్పేది ధైర్యంగా వ్యాధితో పోరాడమని మాత్రమేనని అన్నారు. పలు సందర్భాలలో మన ధైర్యం మనకు కొండంత బలం ఇస్తుందని మిగిలింది నిపుణులైన వైద్యులు అందించే చికిత్స అని పేర్కొన్నారు.
అనంతరం మనోహర్ మాట్లాడుతూ తనకు క్యాన్సర్ వచ్చిందని తెలిపిన తర్వాత వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించానని చెప్పారు. ఈ వ్యాధితో పోరాడే సందర్భాలలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మంచి హాస్పిటల్ చికిత్స తీసుకోవడం ఎంతో ముఖ్యమనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు. క్యాన్సర్ వచ్చిన వెంటనే ఆందోళనకు గురి కావద్దని వైద్యులను సంప్రదించాలని సూచించారు.
చివరగా రఘురామిరెడ్డి మాట్లాడుతూ తాను అమెరికాలో పని చేస్తుండగా క్యాన్సర్ వ్యాధి సోకిందని చెప్పారని అది కూడా 4 వ స్టేజీలో అని స్పష్టం చేశారని అయితే తాను వెంటనే హైదరాబాదు చేరుకొని చికిత్స అందుకున్నానని చెప్పారు. తనకు వైద్యులు, కుటుంబ సభ్యులు అందించిన సహకారం, మనో ధైర్యం ఎంతగానో కోలుకోవడానికి దోహదపడిందని చెప్పారు. వ్యాధి సోకిందనగానే భయ పడవద్దని ఎన్నో అత్యాధునిక చికిత్స పద్దతులు అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని గ్రహించి ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు.
వీరందరూ తమకు రెనోవా సౌమ్య క్యాన్సర్ కేంద్రం అందించిన తోడ్పాటు, చికిత్స పై సంతృప్తి వ్యక్తం చేస్తూ తాము వ్యాధిని నయం చేసుకొని సాధారణ జీవనాన్ని గడపడానికి వీలు కలిపించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
రెనోవా సౌమ్య క్యాన్సర్ కేంద్రం చేపట్టిన పలు కార్యక్రమాలలో భాగంగా 4 వ ఫిబ్రవరి నాడు మహిళలకు ప్రత్యేకంగా ఉచిత రొమ్ము క్యాన్సర్ నిర్థారణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సదుపాయాన్ని మహిళలు పెద్ద సంఖ్యలో వినియోగించుకోవాలని హాస్పిటల్ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.