బడ్జెట్ లో ఇంత అన్యాయం జరిగినా జగన్ రెడ్డి నోరు విప్పరా ? ఏపీ పీసీసీ అధ్య‌క్షుడు . శైల‌జానాథ్

దేశాన్ని అమ్మేసే ప్రక్రియ బీజేపీ చేస్తోంది

ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలి

ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు – ఏపీసిసి అధ్యక్షుడు శైలజనాథ్

కర్నూలు :

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ స్థూల వ్యవస్థలను ప్రైవేట్ పరం చేశారని ఏపీసిసి అధ్యక్షుడు శైలజనాథ్ అన్నారు.దేశంలో ఆదాని గ్రూప్ భారీగా పెరిగిపోయిందని, అంబానిని కూడా మించిపోయిందని తెలిపారు. అటవీ ప్రాంతాలను కూడా ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని అమ్మేసే ప్రక్రియ బీజేపీ చేస్తోందని విమర్శించారు. పేదలు అంటే మోడీకి చిన్న చూపన్నారు. ఎన్ఆర్జిఎస్ స్కీంకి బడ్జెట్లో డబ్బులు తగ్గించారని తెలిపారు. ఏపీ నుంచి ఎన్నికైన ఎంపీలు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. బడ్జెట్లో ఏపీకి అరకొర కేటాయింపులు జరిగాయని ఆయన విమర్శించారు. ఏపీకి కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన కొన్ని స్కీంలను ఇప్పుడు ఇచ్చారన్నారు. ఏపీకి బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. విశాఖ రైల్వే జోన్ విషయం ఏమయిందన్నారు. ప్రజలు దేశ భక్తి ముసుగు వేసుకున్న దేశ ద్రోహులను ఎన్నుకున్నారని వ్యాఖ్యానించారు. ఆదాని, అంబానీ దయాదాక్షిణ్యాలపై బ్రతకాల్సిందే అని అన్నారు. నదుల అనుసంధానం రాష్ట్రాలతో మాట్లాడకుండా ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారని నిలదీశారు. బడ్జెట్లో జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి కనీసం నోరు కూడా విప్పలేదన్నారు. ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందని శైలజనాథ్ స్పష్టం చేశారు. ఈ బడ్జెట్ ఏపీకి తీరని అన్యాయం చేసిందన్నారు. ఆర్థిక మంత్రి నోట కనీసం ఆంధ్రప్రదేశ్ పేరు కూడా వినపడలేదంటే కేంద్రం రాష్ట్రం పట్ల ఎంత వివక్ష చూపుతోందో అర్థమవుతోందన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని కోరినా ఇస్తాం ఇస్తామంటూ చివరికి కేంద్రం ఏపీకి మొండిచెయ్యి చూపించిందని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రం 4 బడ్జెట్ లు పెట్టింది. రూ.39.45 లక్షల కోట్ల బడ్జెట్ చేస్తే అందులో రూ.16.81 లక్షల కోట్లు లోటు ఉందని, బడ్జెట్ లో సుమారు 40 శాతం అప్పు తెచ్చుకుని దేశాన్ని నడిపిండచడం ఆందోళ కలిగిస్తోందన్నారు. విభజిత రాష్ట్రమైన ఏపీని మిగతా రాష్ట్రాలతో శాఖాపరమైన కేటాయింపులు కాకుండా విభజన చట్టం ద్వారా హక్కుగా రావాల్సిన అంశాలు ఉన్నాయని, అవి కేంద్రం ఇవ్వాలి..మనం పోరాడి సాధించుకోవాలన్నారు. మోడీని పొడగటానికి తప్ప హక్కుల కోసం పోరాడటం లేదు. 20 మంది ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి హక్కులు సాధిస్తామన్న హామీ ఏమైంది అని శైలజనాథ్ ప్రశ్నించారు. జగన్ చేష్టలతో వైసీపీ అభిమానులు సైతం సిగ్గుపడుతున్నారు. ఇంత చేతకాని ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉన్నారా.? రెవెన్యూ లోటు గురించి మాట్లాడుతున్నారా.? మీడియా ముందుకు వచ్చి ఎందుకు ప్రశ్నించడం లేదు.? ఇప్పుడే మాట్లాడలేనివాళ్లు ముందుముందు ఏం మాట్లాడతారు.? ప్రశ్నిస్తే ఎదురుదాడి చేయడమే వచ్చు. వైసీపీ ఎందుకు మాట్లాడలేకపోతోందో అర్థం కావడం లేదు. ప్రత్యేక హోదా గురించి ఊదరగొట్టి మాట్లాడి ఇప్పుడు చేతులు ముడుచుకున్నారు. హోదాపై నిరుద్యోగ యువత, రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అని శైలజనాథ్ ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *