ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లపై సిఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
హైదరాబాద్, జూన్ 30
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్షించారు. హైదరాబాద్ బీ.ఆర్.కే.ఆర్ భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. పోలీసులు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యేందుకు విచ్చేయుచున్న ప్రధాని మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో ఉంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ప్రధాన మంత్రి 2వ తేదీన హైదరాబాద్ చేరుకుని 4వ తేదీ ఉదయం బయలుదేరి వెళ్తారు. జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాన మంత్రితో పాటు అందరు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలు నగరానికి రానున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
ప్రధాని పర్యటనకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. వీవీఐపీల పర్యటన సందర్భంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రధాన మంత్రి పర్యటన సందర్భంగా సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ట్రాఫిక్ ను సజావుగా సాగేలా చూడాలని, అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. బహిరంగ సభ జరిగే పరేడ్ గ్రౌండ్‌లో బారికేడింగ్, లైటింగ్ మరియు ఇతర అన్ని ఏర్పాట్లను రూల్ బుక్ ప్రకారం ఖచ్చితంగా పాటించాలని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో డిజిపి మహేందర్ రెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ , మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, ఆరోగ్య శాఖ కార్యదర్శి SAM రిజ్వి, TR&B సెక్రటరీ K.S.శ్రీనివాసరాజు, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ C.V.ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్‌ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, రాజ్‌భవన్ గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్, అగ్నిమాపక శాఖ డీజీ సంజయ్ కుమార్ జైన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.