చైనాలో కరోనా విలయం.. వ్యాక్సిన్ లపై ఎన్నో సందేహాలు..!

డ్రాగన్ కంట్రీలో కరోనా విలయ తాండవం చేస్తుంది. కోట్లలో కేసులు వేలల్లో మరణాలు నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. నిన్నమొన్నటిదాకా ఆంక్షలతో సతమతం అవుతున్నామంటూ గగ్గోలు పెట్టిన చైనీయులు, ఇప్పుడు విరుచుకుపడుతున్న మహమ్మారితో విలవిల్లాడుతున్నారు. అత్యంత చురుగ్గా ఉన్న బీఎఫ్.7 వీరియంట్ విస్తృతంగా వ్యాప్తి చెందడమే తాజా విపరిణామాలకు మూలకారణం. చైనాలో మూడేళ్లుగా ‘జీరో కొవిడ్’ విధానంలో భాగంగా కఠిన నిబంధనలు అమలు చేశారు. అపార్టుమెంట్లకు బయటి నుంచి తాళాలు సైతం వేయగా, ఓ అగ్నిప్రమాదం ఘటనలో బయటపడలేక కొందరు ప్రాణాలు కోల్పోయిన ఉదంతంతో చైనీయులు మండిపడ్డారు. ఆంక్షలు సడలించకపోతే జిన్‌పింగ్ దిగిపోవాలంటూ ఆందోళనలకు దిగారు. దాంతో జీరో కొవిడ్ విధానాన్ని సర్కారు ఉపసంహరించుకొంది. ఫలితంగా అక్కడ కొవిడ్ ఒక్కసారిగా జడలు విప్పుతోంది. కరోనా కేసుల సంఖ్య చైనాలో గణనీయంగా పెరిగిపోయింది. మృతుల సంఖ్య సైతం జోరెత్తినట్లు కథనాలు వెలువడుతున్నాయి. రాజధాని బీజింగ్ సహా పలు నగరాల్లో శ్మశానవాటికలన్నీ కిటకిటలాడుతున్నాయని అంతర్జాతీయ వార్తాసంస్థలు చెబుతున్నాయి. కొవిడ్ బాధితుల మృతదేహాల దహనానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అనధికారిక ఆదేశాలు సైతం ఉన్నాయి. ఇంత జరుగుతున్నా, మరణాల సంఖ్యను ఇప్పటికీ డ్రాగన్ దాచిపెడుతోంది.

కొవిడ్ 2019లో తొలిసారి బయటపడినప్పటి నుంచి దేశం మొత్తమ్మీద ఇప్పటి వరకు అయిదువేల పైచిలుకే మరణించారన్నది చైనా అధికారిక సమాచారం. ప్రపంచ ఆరోగ్యసంస్థ మాత్రం అక్కడ ముప్ఫై ఒక్క వేల మందికిపైగా కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారని చెబుతోంది. మరోవైపు కరోనా నియంత్రణ కోసం చైనా తయారు చేసిన వ్యాక్సిన్ తో ఉపయోగమేలేదన్న సందేహం వస్తోంది. కరోనాకు వ్యాక్సిన్ ను అందరి కన్నా ముందే కనిపెట్టామంటూ ఊదరగొట్టి.. పనికిరాని వ్యాక్సిన్ ను ప్రజలకు అంటగట్టిందని చైనా పై విమర్శలు వస్తున్నాయి. తమ దేశంలోనే తయారైన పనికిమాలిన వ్యాక్సిన్లు వేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని విమర్శలు గుప్పించింది. చైనా పంపిన కరోనా వ్యాక్సిన్ తో ఎలాంటి ఉపయోగం ఉండదని పేద దేశాలు చాలా రోజుల క్రితమే గుర్తించాయి.