కరోనా నేపథ్యంలో అవయవదానం చేసేవారి సంఖ్య నలభై శాతం తగ్గింది : తెలంగాణ ప్రభుత్వ జీవన్ ధాన్ ఇన్ ఛార్జ్ డాక్టర్ స్వర్ణలత
అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుందని జీవన్ దాన్ ఇన్ ఛార్జ్ డాక్టర్ జి.స్వర్ణలత అన్నారు . హైదరాబాద్ సనత్ నగర్ లో ని రెనోవా ఆసుపత్రిలో ప్రపంచ అవయవదాన దినోత్సవంను పురస్కరించుకుని అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రెనోవా ఆసుపత్రి ఛీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీమతి శాంతి మాట్లాడుతూ అవయవదానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న జీవన్ ధాన్ కార్యక్రమంపై వైద్యులు, సిబ్బంది, రోగులలో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.
అనంతరం ముఖ్య అతిథిగా కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ప్రభుత్వ జీవన్ దాన్ ప్రొగ్రాం ఇన్ ఛార్జ్ డా. జి స్వర్ణలత మాట్లాడుతూ కిడ్నీ, లివర్ వంటి కొన్ని అవయవాలను బ్రతికి ఉన్న వారి నుండి సేకరించగలుగుతున్నామని తద్వారా వీటిని దానం చేసే వారు పూర్తి అవగాహన కల్పిస్తున్నామన్నారు. గుండె, ఊపిరితిత్తులు వంటి పలు కీలక అవయవాలను బ్రెయిన్ డెడ్ వారి నుండి మాత్రమే సేకరించాల్సి ఉందని ఆమె తెలిపారు. ఇలా బ్రెయిన్ డెడ్ అయిన వారి నుండి అవయవాలు సేకరించే విషయంపైనే ప్రజలలో పెద్ద ఎత్తున అవగాహన కలిపించాల్సి ఉందని ఆమె చెప్పారు. ఇలాంటి వారి వద్ద నుండి సేకరించిన అవయవాల కారణంగా తొమ్మిది మంది ప్రాణాలు కాపాడవచ్చన్నారు. ఈ అంశాలపై సరైన అవగాహన లేమి కారణంగా పలు ఇబ్బందులు ఏర్పడుతాయని, వీటిపై అందరూ కలిసికట్టుగా పని చేయాల్సి ఉంటుందని సూచించారు.
ఇక ప్రస్తుత కోవిడ్ మహమ్మారి కారణంగా అవయవదానాలపై ప్రభావం పడిందని డా. స్వర్ణలత అన్నారు. కోవిడ్ సోకి మరణించిన వారి నుండి అవయవాలను సేకరించలేకపోవడం ప్రధాన సమస్యగా మారిందని ఆమె చెప్పారు. కోవిడ్ కాలంలో 40 శాతం పైగా అవయవదానాలు తగ్గినట్లు ఆమె తెలిపారు. ఇక కోవిడ్ కారణంగా ఊపిరితిత్తులు పాడవడం వలన ఇటీవల కాలంలో ఊపిరితిత్తుల లభ్యతపై కొంత ప్రభావం పడిందని ఆమె వివరించారు. జీవన్ దాన్ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత గత 8 సంవత్సరములలో 800 పైగా అవయవమార్పిడి చికిత్సలు జరిగినట్లు ఆమె తెలిపారు. అయితే ప్రస్థుతం ఎక్కువగా లివర్ తో పాటు ఊపిరితిత్తుల కోసం ఎదురుచూసే వారి సంఖ్య పెరిగినట్లు ఆమె చెప్పారు.
అనంతరం రెనోవా ఆసుపత్రి జనరల్ ఫిజిషియన్ డా స్పందన మాట్లాడుతూ సంస్థలో అవయవదానంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే సుమారు 100 మందికి పైగా సిబ్బంది అవయవదానాన్ని అంగీకరిస్తూ పత్రాలను అందజేశారని తెలిపారు. ప్రభుత్వ నిబందనల మేరకు రెనోవా హాస్పిటల్స్ అవయవదానాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు.
అనంతరం కార్యక్రమంలో సిబ్బంది అవయవదానాన్ని అంగీకరిస్తూ చేసిన పత్రాలను డా. స్పందన జీవన్ దాన్ ఇన్చార్జ్ డా. స్వర్ణలతకు అందజేశారు. అనంతరం ముఖ్య అతిథితో పాటు హాస్పిటల్ కు చెందిన వైద్యులు అవయవదాన కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన బోర్డుపై తమ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో డా. స్వర్ణలతతో పాటు రెనోవా హాస్పిటల్ గ్రూప్ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీమతి శాంతి,రెనోవా ఆసుపత్రి జనరల్ ఫిజిషియన్ డా. స్పందన, రెనోవా హాస్పిటల్ హెడ్ డాక్టర్ పి శేఖర్ తో పాటు పలువురు వైద్యులు, వైద్యేతర సిబ్బంది పాల్గొన్నారు.