హైదరాబాద్ వరద కష్టాలను నివారించేందుకు నాలాల అభివృద్ది పైన సమగ్ర కార్యాచరణ: మంత్రి కే. తారక రామారావు

హైదరాబాద్

హైదరాబాద్ నగరంలో గతంలో ఎన్నడూ లేనంతగా కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నాలాల విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నగరంలోని నాలాల విస్తరణ, అభివృద్ధి కోసం ఒక సమగ్ర కార్యక్రమాన్ని పెద్ద చేపట్టేందుకు జిహెచ్ఎంసి ప్రణాళికలను రూపొందించింది.

పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు జీహెచ్ఎంసి ఉన్నత అధికారులతో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికే నాలాలకు రిటైనింగ్ వాల్ కట్టి, వాటిని బలోపేతం చేయడం వంటి కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికలపై  ఇప్పటికే పలు ప్రాథమిక సమావేశాలు నిర్వహించిన మంత్రి కేటీఆర్, నగరంలోని అన్ని జోన్లలో త్వరలో ప్రారంభించనున్న నాళాల అభివృద్ధి కార్యక్రమాలపైన ఈ సమావేశంలో చర్చించారు.

అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో దశాబ్దాలుగా నాలాలు కుంచించు పోయాయని,  నాలాల బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా తాము సమగ్ర ప్రణాళికలతో ప్రత్యేక పని చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలు ఒకేసారి కుండపోతగా కురుస్తున్నాయని, వీటివల్ల గతంలో ఎన్నడూ లేనివిధంగా నగరంలోని అనేక ప్రాంతాలు ముంపుకు గురవుతున్న నేపద్యంలో ఈ నాలాల విస్తరణ,  బలోపేతం అత్యంత ఆవశ్యకమైన కార్యక్రమంగా మారిందన్నారు. వరదల వలన భవిష్యత్తులో నగర పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలన్న ప్రాథమిక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మరింత సమగ్రంగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. నాలా విస్తరణ వలన ప్రభావితమయ్యే పేదల విషయంలో ప్రభుత్వం మానవీయ దృక్పథంతో వ్యవహరిస్తదని, వీరిలో అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.  నాలాలు, చెరువుల రక్షణ, అభివృద్ధి కోసం అవసరమైతే ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకువచ్చేందుకు యోచిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.  త్వరలోనే నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలతో నాలాల విస్తరణ పైన ఒక సమావేశాన్ని నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.

త్వరలో చేపట్టనున్న నాలాల అభివృద్ధి పైన జోనల్ కమిషనర్లు ఈ సమావేశంలో మంత్రికి వివరాలు అందించారు. ఇప్పటికే ఆయా నాలాలలో ఉన్న అడ్డంకులు, నాలాల విస్తరణ, రిటైనింగ్ వాల్ నిర్మాణం వంటి అంశాలపైన క్షేత్ర స్థాయిలో తమ సిబ్బందితో సర్వే చేసి రూపొందించిన నివేదికల వివరాలను జోనల్ కమిషనర్లు మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్ ఎన్ డి పి కార్యక్రమంతో సమన్వయం చేసుకొని ముందుకుపోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మొదటి దశలో చేపట్టే నాలాల విస్తరణతోపాటు, ప్రతిసారి భారీ వర్షాల వలన వరదకు కారణం అవుతున్న బాటిల్ నెక్స్ ( నాలాలు బాగా కుంచించుకు పోయిన ప్రాంతాలను) గుర్తించి వాటిని విస్తరించే కార్యక్రమాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

ఈవీడిఎం కార్యాలయంలో  జరిగిన ఈ సమావేశంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *