హుజరాబాద్ నియోజకవర్గం లోని దళితులతో భేటీ కానున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్
హుజూరాబాద్ నియోజక వర్గం లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్న, తెలంగాణ దళిత బంధు పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ లపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 26 వ తేదీన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో సమావేశం జరుగనున్నది. ఉదయం 11 గంటలకు ప్రారంభమై సాయంత్రం దాకా జరగనున్న ఈ సమావేశంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని గ్రామానికి నలుగురు చొప్పున ( ఇద్దరు పురుషులు ఇద్దరు మహిళలు) , ప్రతి మున్సిపాలిటీలోని వొక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున ( ఇద్దరు పురుషులు ఇద్దరు మహిళలు) మొత్తం 412 మంది దళిత పురుషులు మహిళలు పాల్గొంటారు. వారితో పాటు 15 మంది రిసోర్సు పర్సన్స్ పాల్గొంటారు. మొత్తం 427 మంది హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళితులు ఈ అవగాహన సదస్సులో పాల్గొంటారు.
ఈ సదస్సు గురించి సిఎం కెసిఆర్ వివరిస్తూ…. ‘‘ జూలై 26 న హుజూరాబాద్ నియోజకవర్గం పరిథిలోని గ్రామాల నుంచి వారి వారి మండల కేంద్రాలకు ఉదయం 7 గంటలకు చేరుకుంటారు. మండల కేంద్రంలో అల్పాహార కార్యక్రమం ముగించుకుని అక్కడ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో హుజూరాబాద్ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి హైద్రాబాద్ కు మొత్తం 427 మంది పలు బస్సుల్లో బయలు దేరుతారు. ఉదయం 11 గంటల వరకు హైద్రాబాద్ ప్రగతి భవన్ కు చేరుకుంటారు.’’ అని సిఎం తెలిపారు.
ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన దళిత బంధు పథకం ముఖ్య ఉద్దేశ్యం, పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ తో పాటు పథకాన్ని విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల మీద సిఎం కెసిఆర్ వారికి అవగాహన కల్పిస్తారు. ఫైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ లో ప్రారంభం కానున్న దళితబంధు పథకం, రాష్ట్రంలోని దళితులందరి జీవితాల్లో గుణాత్మక మార్పుకు ఏవిధంగా దోహదపడుతుంది., పైలట్ ప్రాజెక్టును హుజూరాబాద్ లో చేపట్టిన నేపథ్యంలో చారిత్రాత్మక పథకంలో ఆ ప్రాంత బిడ్డలుగా ఎట్లా లీనమై పనిచేయాలె., దళితుల సామాజిక ఆర్థిక గౌరవాన్ని ఉన్నత శిఖరాల్లో నిలబెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న తెలంగాణ దళిత బంధు పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు ఏమిటి ? సిఎం కెసిఆర్ మానస పుత్రికయిన ఈ పథకాన్ని ఎట్లా దళితుల్లోకి తీసుకపోవాలె ? వారి జీవితాలను వారే అభివృద్ధి చేసుకునే దిశగా ఎట్లా వారికి అవగాహన కల్పించాలె ? అధికారులతో ఎట్లా సమన్వయం చేసుకోవాలె, కలిసి పోవాలె ? అనే తదితర అంశాలను ఇంటరాక్షన్ సెషన్ లో హాజరైన వారికి సిఎం కెసిఆర్ వివరించి అవగాహన కల్పిస్తారు. మధ్యాహ్నం లంచ్ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత కొనసాగిన అవగాహన సదస్సు సాయంత్రానికి ముగుస్తుంది.