భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రానికి వరదలు పెరుగుతున్నాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, క్షణ క్షణం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. కృష్ణా, గోదావరీ పరీవాహక ప్రాంతాల్లో తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే పరిస్థితులున్నందున అందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను సిఎం ఆదేశించారు.
రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణంతో, కాలువలు వాగులు వంకలు పారుతూ, రిజర్వాయర్లు చెరువులు కుంటలు ఏడాది పాటు నీటితో నిండి వుంటున్నాయని, అకాల వర్షాలకు మరింత వరద ఉదృతి పెరిగే పరిస్థితులు ఉత్పన్నమౌతున్నాయన్నారు. గత పాలనలో తెలంగాణలో కరువు నివారణ చర్యలకు మాత్రమే అలువాటు పడివున్న అధికారయంత్రాంగం ఇకనుంచి వరద నివారణ చర్యల పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను స్పష్టం చేశారు. ఈ మేరకు వరద నిర్వహణ కోసం శాశ్వత ప్రాతిపదికన పకడ్బందీ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని సిఎం ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఎగువ రాష్ట్రాలతో పాటు, తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వానల నేపథ్యంలో కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన చర్యలు, చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.
ప్రగతి భవన్ లో గురువారం జరిగిన ఈ సమావేశంలో..జుక్కల్ ఎమ్మేల్యే హన్మంతు షిండే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ్ రావు, సెక్రెటరీలు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, నీటిపారుదలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ ఎం.రఘునందన్ రావు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, నీటిపారుదలశాఖ ఈఎన్సీ సి.మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, ప్రియాంక వర్గీస్, సీడీఎంఏ సత్యనారాయణ, సీఐజీ శేషాద్రి, ప్రకృతి విపత్తుల నివారణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, వైద్యశాఖ కార్యదర్శి ఎస్ఎఎం రిజ్వీ, ఐఎండీ నాగరత్న, ఎన్.డి.ఆర్.ఎఫ్ అధికారి దామోదర్ సింగ్, పంచాయతీరాజ్ ఈఎన్సీ సంజీవరావు, టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఐజీలు స్టీఫెన్ రవీంద్ర, నాగిరెడ్డి, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, సైబరాబాద్ సీపీ వి.సి.సజ్జనార్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, ఆర్మీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.