గుడివాడలో గ్యాంగ్ వార్.. టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టే యత్నం.. ఏం జరిగిదంటే..?
కృష్ణా జిల్లా గుడివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ ఆఫీస్ పైకి వైసీపీ కార్యకర్తలు పెట్రోలు ప్యాకెట్లు విసిరి నిప్పటించే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు కర్రలు, కత్తులతో దాడిచేసి భయభ్రాంతులకు గురిచేశారు. నాని ముఖ్య అనుచరుడైన మెరుగుమాల కాళి ఆధ్వర్యంలో ఈ ఘటన జరిగినట్టు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగినప్పుడు పోలీసులు అక్కడే ఉన్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడివాడలో ఇవాళ వంగవీటి రంగా వర్ధంతి నిర్వహించేందుకు టీడీపీ నాయుకులు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో నాని అనుచరుడైన కాళి టీడీపీ గుడివాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావుకు ఫోన్ చేసి రంగా వర్ధంతి నిర్వహించొద్దని హెచ్చరించారు. ఆ విషయం చెప్పడానికి నువ్వెవరని వెంకటేశ్వరరావు ప్రశ్నించడంతో కాళి తనను తీవ్ర స్వరంతో హెచ్చరించినట్టు వెంకటేశ్వరరావు ఆరోపించారు. అసభ్య పదజాలాన్ని ఉపయోగించడమే కాకుండా ఎక్కువ మాట్లాడితే తనను లేపేస్తానని బెదిరించాడని రావి పేర్కొన్నారు. మరోవైపు, విషయం తెలిసిన రావి వర్గీయులు టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి కాళి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అదే సమయంలో కార్యకర్తలతో కలిసి కాళి అక్కడకు చేరుకున్నారు. టీడీపీ కార్యాలయంపైకి పెట్రోలు ప్యాకెట్లు విసిరి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. కర్రలు, కత్తులతో దాడిచేశారు. టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. వైసీపీ నాయకులను అక్కడి నుంచి పంపించి వేశారు.
