వైద్యవిద్య, వైద్యం రెండూ సామాన్య మానవునికి ఆర్థికంగా అందుబాటులో ఉండాలి:ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు

సెప్టెంబర్ 6, 2021, హైదరాబాద్

దేశవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య వసతులను ఏర్పాటుచేసుకోవాల్సిన అవసరముందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు మరింత దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. మన దేశంలో వైద్య వసతులను మెరుగుపరుచుకోవాల్సిన అవసరాన్ని కరోనా మహమ్మారి మరోసారి గుర్తుచేసిందని ఆయన పేర్కొన్నారు.

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని అసోసియేషన్ ఆఫ్ నేషనల్ బోర్డ్ అక్రిడిటేడ్ ఇనిస్టిట్యూషన్స్ (ఏఎన్‌బీఏఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘11వ వార్షిక వైద్య అధ్యాపకులకు అవార్డుల’ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య కళాశాలల సంఖ్యను మరింతగా పెంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. వైద్యులు, రోగుల నిష్పత్తిలోని అంతరం మన దేశంలో ఎక్కువగా ఉందన్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యిమంది రోగులకు ఒక వైద్యుడు (1:1000) ఉండాలని కానీ భారతదేశంలో ఈ సంఖ్య 1:1,456 గా ఉందన్న విషయాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు.
ఈ అంతరాన్ని తగ్గించేందుకు కనీసం ప్రతి జిల్లా కేంద్రానికి ఒక వైద్య కళాశాలను ఏర్పాటుచేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం తన వంతు ప్రయత్నంచేస్తోందన్నారు. ఈ దిశగా వైద్యరంగంలోని భాగస్వామ్య పక్షాలు కూడా తమవంతు పాత్ర పోషించాలని ఆయన సూచించారు. చాలా మంది వైద్యులు కూడా గ్రామీణ ప్రాంతాలకంటే పట్టణ ప్రాంతాల్లో పనిచేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్న విషయాన్నీ ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు.
వైద్య విద్యతోపాటు వైద్యం కూడా సామాన్యుడికి అందుబాటు ధరల్లో ఉండేలా చూడటం కూడా ఈ రంగంలో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యతన్న ఉపరాష్ట్రపతి, ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో శరవేగంగా వస్తున్నమార్పులను ప్రస్తావించారు. వ్యాధుల నిర్ధారణ, చికిత్స విషయంలో అధునాతన సాంకేతికత, సరికొత్త పరికరాల వినియోగాన్ని మరింతగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కరోనా మహమ్మారి కూడా వైద్యులు, శాస్త్రవేత్తలు మొదలుకుని సమాజంలోని ప్రతి ఒక్కరికీ సరికొత్త పాఠాలను బోధించిందని ఉపరాష్ట్రపతి అన్నారు.

వైద్య వృత్తి అత్యంత పవిత్రమైన వృత్తుల్లో ఒకటన్న ఉపరాష్ట్రపతి, ఆ విలువలను, ఆ పవిత్రతను కొనసాగించడంలో ప్రతి వైద్యుడూ తనవంతు పాత్రపోషించాలన్నారు. మరీ ముఖ్యంగా యువ డాక్టర్లు, వైద్య విద్యార్థులు నైతికతను, ఉన్నతమైన విలువలను అలవర్చుకుని, తమ దైనందిన జీవితంలో వాటిని అమలుచేయాలని సూచించారు.

ఉన్నతమైన విలువలతో కూడిన విద్యాబోధనను అందించేందుకు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ బోర్డ్ అక్రిడిటెడ్ ఇనిస్టిట్యూషన్స్ (ఏఎన్‌బీఏఐ) చేస్తున్న కృషిని ఉపరాష్ట్రపతి అభినందించారు. దేశంలోని ప్రముఖ ఆసుపత్రులు, వైద్య సంస్థలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఏఎన్‌బీఏఐ వేదిక ద్వారా కేంద్ర ప్రభుత్వంతో కలిసి వైద్యవిద్యలో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యనందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా భారత మాజీ రాష్ట్రపతి, రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. వైద్య అధ్యాపకులకు అవార్డులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎన్‌బీఏఐ అధ్యక్షుడు డాక్టర్ అలెగ్జాండర్ థామస్, కార్యనిర్వాహక చైర్మన్ డాక్టర్ జీఎస్ రావు, కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ లింగయ్య, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షుడు డాక్టర్ బి.బాలరాజుతోపాటు వైద్యులు, వైద్య విద్యార్థులు, ఈ రంగంలోని భాగస్వామ్య పక్షాల ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *