ఔట్‌డోర్ డిజిటల్ ప్రకటనల రంగంలో బెల్‌ ప్లస్‌ మీడియా వేగంగా వృద్ది చెందుతుంది : కో–ఫౌండర్లు గాయత్రి, అభిలాష్

దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో విస్తరణ
అందుబాటు ధరల్లో కంపెనీలకు సేవలు
ఇప్పటికే 3,200ల స్క్రీన్ల ఏర్పాటు
2023 డిసెంబర్‌కల్లా 20,000 స్క్రీన్లు
కో–ఫౌండర్లు గాయత్రి, అభిలాష్ వెల్లడి

హైదరాబాద్
ఔట్‌డోర్‌ డిజిటల్‌ ప్రకటనల రంగంలో బెల్‌ ప్లస్‌ మీడియా దూసుకెళుతోంది. కంపెనీ ఏర్పాటైన రెండేళ్లలోనే దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో 3,200 పైచిలుకు స్క్రీన్లతో విస్తరించింది. యాపిల్, ఆడి, మలబార్, అపోలో హాస్పిటల్స్‌ వంటి దిగ్గజ బ్రాండ్ల ప్రకటనలను డిజిటల్‌ తెరలపై టీ–హబ్, డీఎల్‌ఎఫ్, లోధా, హైహోమ్, అపర్ణ, అరబిందో, ఇనార్బిట్, ల్యాంకో హిల్స్‌ తదితర వందలాది గృహ సముదాయాలు, కమర్షియల్‌ ప్రాజెక్టులు, మాల్స్‌లో ప్రదర్శిస్తోంది.

భారత్‌లో ఔట్‌డోర్‌ డిజిటల్‌ ప్రకటనల రంగంలో వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీగా నిలిచామని బెల్‌ ప్లస్‌ మీడియా కో–ఫౌండర్లుగాయత్రి రెడ్డి చప్పిడి, దేవ్‌ అభిలాష్‌ రెడ్డి కొత్తపు తెలిపారు. దేశంలో తొలిసారిగా రెండు డిస్‌ప్లేలతో స్క్రీన్లను ఏర్పాటు చేసిన ఘనత తమదేనని వివరించారు. అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌తో వినూత్న అనుభూతి, అతి తక్కువ ఖర్చు, సౌకర్యంతోపాటు ప్రకటనలను కస్టమైజ్‌ చేసుకునే వీలుండడం వల్లే ఈ విజయం సాధ్యమైందని చెప్పారు.

రెండు డిస్‌ప్లేస్‌ ప్రత్యేకం..
‘తక్కువ బడ్జెట్‌తో వినియోగదార్లను చేరుకోవడానికి మంచి వేదికను తీసుకొచ్చాం. ప్రకటనలకు వాడుతున్న స్క్రీన్లు 65 అంగుళాల వరకు ఉన్నాయి. రెండు డిస్‌ప్లేలు ప్రదర్శించడం ఈ స్క్రీన్స్‌ ప్రత్యేకత. అలాగే దీనికి ఉండే సెన్సార్‌తో ఎంత మంది వీక్షించారో సుమారుగా తెలుసుకోవచ్చు. పైన ఉండే డిస్‌ప్లేలో బ్రాండ్ల ప్రకటనలు ప్రదర్శితమవుతాయి. కింది డిస్‌ప్లేలో సంబంధిత సొసైటీ నుంచి వెలువడే నోటీసులు, అసోసియేషన్‌ నుంచి సందేశాలు, అక్కడ జరిగే కార్యక్రమాలు ప్రదర్శిస్తాం.

సొసైటీలకు ఈ సేవలు ఉచితం. పైగా అక్కడ స్క్రీన్లను ఏర్పాటు చేసినందుకు వారికి అద్దె చెల్లిస్తాం. క్లయింట్‌కు బెల్‌ ప్లస్‌ అప్లికేషన్‌ ఇస్తాం. ప్రకటనల కంటెంట్‌ను వారే ఎంచుకోవచ్చు. ఎన్నిసార్లు ప్రకటన వెలువడింది, ఎంత మంది చూశారు, సాంకేతిక సమస్యలు తెలుసుకోవచ్చు’ అని గాయత్రి రెడ్డి తెలిపారు.

డిసెంబర్‌లోగా 20,000 స్క్రీన్లు..
బెల్‌ ప్లస్‌ మీడియా 2021 జనవరిలో ప్రారంభం అయిందని గాయత్రి రెడ్డి తెలిపారు. ‘తొలి ప్రాజెక్టు మైహోమ్‌ అభ్రా. అసోసియేషన్‌ సెక్రటరీ కె.ఎస్‌.పి.రెడ్డి వెన్నుతట్టారు. ఈ ఉత్సాహంతో నెలరోజుల్లోనే 10 కాంట్రాక్టులు సాధించాం. తొలి ఏడాది 900 స్కీన్లు ఏర్పాటయ్యాయి. రెండవ ఏడాది 2,300 స్క్రీన్లు జతకూడాయి. మహమ్మారిలోనూ వృద్ధి సాధించాం.

హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, చెన్నై, కొచ్చి, గోవాలో అడుగుపెట్టాం. క్లయింట్ల జాబితాలో తనిష్క్, మెడికవర్, స్విగ్గీ, జొమాటో వంటివి కూడా ఉన్నాయి. ప్రస్తుతం 80 మంది ఉద్యోగులు ఉన్నారు. చెన్నైలో స్క్రీన్ల అసెంబ్లింగ్‌ చేపడుతున్నాం’ అని వివరించారు.

మొత్తం 20 నగరాలు..
‘2022 మార్చిలో రూ.7.5 కోట్ల సీడ్‌ ఫండ్‌ను హైదరాబాద్‌ ఏంజిల్స్, అట్లాంటా సిండికేట్, మరో నలుగురి నుంచి అందుకున్నాం. రెండవ రౌండ్ ద్వారా త్వరలో నిధులు సమీకరిస్తాం. 2023 డిసెంబర్‌కల్లా 20,000 స్క్రీన్లు, మొత్తం 20 నగరాలు, 200 మంది ఉద్యోగుల స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా చేసుకున్నాం. వైజాగ్, విజయవాడ వంటి ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తరిస్తాం.

14 శాతం జనాభాకు చేరుకునే సామర్థ్యం డిజిటల్‌ ఔట్‌డోర్‌ ప్రకటనల రంగానికి ఉంది. ఇందుకు దేశవ్యాప్తంగా 5 లక్షల స్క్రీన్లు అవసరం. పరిశ్రమ ఏటా 14 శాతం వృద్ధి చెందుతోంది. మూడేళ్లలో 32 శాతం వృద్ధికి ఆస్కారం ఉంది. ఆసియా దేశాల్లో అత్యధిక వృద్ధి భారత్‌కే సాధ్యం’ అని అభిలాష్ తెలిపారు.

కళాశాలలోనే వ్యాపార ఆలోచన..
కోయంబత్తూరులోని పీఎస్‌జీ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీలో దేవ్‌ అభిలాష్‌ రెడ్డి (కంప్యూటర్‌ సైన్స్‌), గాయత్రి రెడ్డి (ఎలక్ట్రికల్స్‌) 2016లో బీటెక్‌ పూర్తి చేశారు. 2015లో వ్యాపార ఆలోచనతో కళాశాలలో ఎంట్రప్రెన్యూర్స్‌ క్లబ్‌ను ఇద్దరూ కలిసి స్థాపించారు. హైదరాబాద్‌లోని వోక్సెన్‌ యూనివర్సిటీలో ఇద్దరూ ఎంబీయే పట్టా అందుకున్నారు. గాయత్రి లండన్‌లోని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్‌ ఎకనమిక్స్, ట్రేడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ చదివారు.

అభిలాష్‌ సింగపూర్‌లోని నాన్యాంగ్‌ యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ పూర్తి చేశారు. ప్రకటనల రంగంలో ఉన్న ఓ ప్రముఖ కంపెనీలో అభిలాష్‌ ఆరు నెలలు ఉద్యోగం చేశారు. 2020లో వీరిద్దరూ చైనా వెళ్లి డిజిటల్‌ ఔట్‌డోర్‌ ప్రకటనలపై నెలరోజులపాటు అధ్యయనం చేశారు.

టర్నింగ్‌ పాయింట్‌ అక్కడే..
చైనా టూర్‌ టర్నింగ్‌ పాయింట్‌ అని అంటారు ఈ యువ వ్యాపారవేత్తలు. తాము ఎంచుకున్న వ్యాపార విధానం అనతి కాలంలోనే విజయవంతం అవుతుందన్న నమ్మకాన్ని నిజం చేశారు.

దుబాయిలో జరిగిన మార్కెటింగ్‌ 2.0 సదస్సులో మార్కెటింగ్, అడ్వరై్టజింగ్‌ విభాగంలో ఔట్‌స్టాండింగ్‌ లీడర్‌షిప్‌ అవార్డును గాయత్రి అందుకున్నారు. ఐకాన్స్‌ ఆఫ్‌ ఏషియా నుంచి డైనమిక్‌ ఎంట్రప్రెన్యూర్‌ ఆఫ్‌ ద ఇయర్‌–2022 అవార్డును ఈ ఏడాది ఢిల్లీలో అభిలాష్‌ చేజిక్కించుకున్నారు. ఈ ఏడాదే ఈ యువ జంట పెళ్లితో ఏకమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *