చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే నిద్రపోతున్నారా..?: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోడో యాత్ర జోరుగా సాగుతోంది. నిన్నటితో రాహుల్ యాత్ర వంద రోజులు పూర్తి చేసుకుంది. తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభించిన ఈ యాత్ర మూడునెలల్లో రాజస్తాన్ కు చేరుకుంది. భారత్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాజస్తాన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్లో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భారత్ జోడో యాత్ర 100 రోజులు విజయవంతం అయిందని రాహుల్ ప్రకటించారు. మరోవైపు పొరుగు దేశమైన చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే, మోదీ ప్రభుత్వం మాత్రం ఆ విషయాన్ని దాచిపెడుతోందని, నిద్రపోతున్నట్టు కనిపిస్తోందని రాహుల్ అన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో ఇటీవల ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా నుంచి ఎదురవుతున్న ముప్పును దాచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. చైనా చొరబాట్లకు మాత్రమే పరిమితం కాకుండా యుద్ధానికి సన్నద్ధమవుతోందని చెప్పారు. కేంద్రం మాత్రం చైనాకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా లేదన్నారు. ఇక భారత్‌కు చెందిన 200 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా తమ అధీనంలోకి తీసుకుందని రాహుల్ ఆరోపించారు. చైనా నుంచి ముప్పు ఉందని తనకు చాలా స్పష్టంగా అనిపిస్తోందన్న ఆయన. గత రెండుమూడేళ్లుగా ఈ విషయం చాలా స్పష్టంగా చెబుతూ వచ్చానని పేర్కొన్నారు. చైనా నుంచి ఎదురవుతున్న ముప్పు విషయాన్ని దాచిపెట్టడం కానీ, నిర్లక్ష్యం చేయడం కానీ జరక్కూడదని పేర్కొన్నారు.
