ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప ఆడబిడ్డల కష్టాలు కనిపించవా?కేంద్రంలోని బిజెపి సర్కార్ కి కేటీఆర్ సూటి ప్రశ్న

కార్పోరేట్లపైన కరుణ తప్ప, ప్రజలపై కనికరం లేదు

కేంద్రంలోని బిజెపి సర్కార్ కి కేటీఆర్ సూటి ప్రశ్న

ఆయిల్ కంపెనీలకు 22 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చిన బిజెపి, ఆడబిడ్డలపై మోపిన 42 వేలకోట్లకుపైగా సబ్సిడీ భారంపై ఎందుకు మాట్లాడదు?

సిలిండర్ ధరను సుమారు మూడు రేట్లు చేసి, సబ్సిడీలకి సర్వమంగళం పాడిన బిజెపిని తరిమి కొట్టాలని ఆడబిడ్డలకి కేటీఆర్ పిలుపు

Bjp అంటే Bభారం అంతా Jజనం పై మోపే Pపార్టీ అన్న కేటీఆర్

బిజెపి ధరల ఘోరాలను తిప్పి కొట్టాలని ఆడబిడ్డలకి కేటీఆర్ విజ్ఞప్తి

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆడబిడ్డలపై మోపిన 42 వేల కోట్ల రూపాయలకు పైగా గ్యాస్ సిలిండర్ భారానికి తగిన పరిహారం చెల్లించాలని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదలతో ఆయిల్ కంపెనీలకు నష్టం వస్తుందంటూ 22,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని తాజాగా ప్రకటించిన ప్రధాని మోడీ అడ్డగోలుగా సబ్సిడీ ఎత్తేసి, గ్యాస్ సిలిండర్ ధరను పెంచి ఆడబిడ్డలపై మోపిన ఆర్థిక భారానికి ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు ఇవ్వరని కేటీఆర్ ప్రశ్నించారు.
నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు సుమారు 400 రూపాయల సిలిండర్ ధర ఉంటే ఈ రోజు అది 1100 దాటి పరుగులు తీస్తుందని కేటీఆర్ విమర్శించారు. 2014లో కేంద్రం ఒక్క సిలిండర్ పైన 827 రూపాయలకు పైగా సబ్సిడీ ఇచ్చేదన్న కేటీఆర్, మోడీ పరిపాలనలో ఈరోజు సబ్సిడీ గుండుసున్నాగా మారిందన్నారు. మోడీ సారథ్యంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటిదాకా 170% గ్యాస్ బుడ్డి రేట్లు పెంచి సబ్సిడీని సంపూర్ణంగా రద్దు చేసిందన్నారు. గత రెండు సంవత్సరాల్లోనే సుమారు 42 వేల కోట్లకు పైగా సబ్సిడీ భారాన్ని సామాన్య జనంపైకి నెట్టిన కేంద్రం, తాజాగా ఆయిల్ కంపెనీలకు మాత్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిందన్నారు. 2014కి ముందు కేవలం నాలుగు వందల సిలిండర్ ధర ఉంటేనే అప్పటి ప్రధానిపైన విమర్శలు చేసిన ప్రధాని, ఇప్పుడు మోడి దేశ ప్రజలకు ఏమని సమాధానం చేప్తారని కెటియార్ ప్రశ్నించారు. ప్రపంచంలోనే అత్యధిక ధరకు సిలిండర్ ను దేశ ప్రజలకు అమ్ముతున్న ప్రధాని మోడి అని, సిలిండర్ ధర విషయంలో విశ్వగురువుగా నిలిచారని ఎద్దేవా చేశారు.

మోడీ హయాంలో అడ్డగోలుగా పెరిగిన సిలిండర్ ధరతో దేశంలో రెండు కోట్ల 11 లక్షల వినియోగదారులు కనీసం ఒక్క సిలిండర్ కూడా తీసుకోలేకపోతున్నారని కేటీఆర్ చెప్పారు. దేశంలో ఉన్న 39 కోట్ల గ్యాస్ కనెక్షన్దారుల పై గత సంవత్సరంలోనే 42 వేల కోట్ల రూపాయల సబ్సిడీ భారాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మోపిందన్నారు. దురదృష్టవశాత్తు గత రెండు సంవత్సరాలు కరోనా సంక్షోభం, లాక్డౌన్ తో మధ్యతరగతి ప్రజల ఆదాయాలు భారీగా తగ్గినా పట్టించుకోని బీజేపీ ప్రభుత్వం ధరలను పెంచి ఆయా వర్గాలను దోచుకోవడం ఆపలేదన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని దౌర్భాగ్యపు బిజెపి పాలనలో ధరలు దండయాత్ర చేస్తూ ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు.

అంతర్జాతీయంగా ధరలు పెరిగిన నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అలాంటి సమాంతర ప్యాకేజీ లేదా సబ్సిడీ ని సిలిండర్ వినియోగదారులకు కూడా చేయాలని కేటీఆర్ కోరారు. ఆర్థిక సహాయం కేవలం ఆయిల్ కంపెనీలకేనా, ఆడబిడ్డలపై కనికరం లేదా అని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. కార్పోరేట్ కంపెనీలకు దేశ సంపదను దోచిపెట్టడాన్నే ఆశయంగా మార్చుకున్న బిజెపికి ఆయిల్ కంపెనీల నష్టాలే తప్ప ఆడబిడ్డల కష్టాలు కనిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. అడ్డగోలుగా పెంచిన సిలిండర్ ధరలు, అడ్డూఅదుపు లేని పెట్రో ధరలతో పాటు ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలతో దేశ ప్రజలకు మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం నరకం చూపిస్తోందన్నారు. నరేంద్ర మోడీ అసమర్ధ విధానాలను అర్థం చేసుకున్న దేశ మహిళలోకం మోయలేని భారం మోపే వాడే మోడీ అని బలంగా నమ్ముతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

మోడీ కావాలో, సబ్సిడీ కావాలో దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన తరుణం ఇదే అన్నారు కేటీఆర్. గ్యాస్ బండ పైన సబ్సిడీ అడిగితే ఏడాదికి మూడు సిలిండర్లు సరిపోవా? అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెక్కరించినట్లు మాట్లాడడం మధ్యతరగతి ప్రజలు ముఖ్యంగా మహిళ లోకంపై బిజెపికి ఉన్న చులకన భావానికి అద్దం పడుతుందని కేటీఆర్ విమర్శించారు. దేశ జనాభాలో సగం ఉన్న మహిళలు తలచుకుంటే బిజెపి ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయని, గ్యాస్ భారాన్ని ధరల భారాన్ని ఇంకా భరించలేమంటూ బిజెపి ఘోరాలను ఇక సహించమంటూ మహిళలు తీర్మానం చేయాలని పిలుపునిచ్చారు. బీహార్ నుంచో.. బెంగాల్ నుంచో కాదు..పేద మధ్యతరగతి మహిళల “వంటింట్లో నుంచే బీజేపీ పతనం” షురూ కావాలన్నారు. భారతీయ జనతా పార్టీ అంటేనే భారం అంతా జనం పై మోపే పార్టీగా మారిందని కేటీఆర్ విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *