విదేశీ పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా దుబాయ్ ఎక్స్ ఫో లో ఏపీ పెవిలియన్ : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
ప్రతి అంశంలో ప్రత్యేకత కనబరచాలని మంత్రి మేకపాటి ఆదేశం
దుబయ్ ఎక్స్ పో -2022 ఏర్పాట్లపై మంత్రి గౌతమ్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
అమరావతి, ఫిబ్రవరి, 03 :
విదేశీ పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా దుబాయ్ ఎక్స్పో లో ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ప్రతి అంశంలో ప్రత్యేక కనబరచే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దుబయ్ ఎక్స్ పో -2022 ఏర్పాట్లపై పరిశ్రమల శాఖ అధికారులతో మంత్రి గౌతమ్ రెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిబ్రవరి 11 నుంచి 17 మధ్య జరగనున్న ఎక్స్ పోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మంత్రి మేకపాటి నేతృత్వంలోని పరిశ్రమల శాఖ అధికారుల బృందం హాజరవుతోందన్నారు. పలు ఆహార, సరకు రవాణా కంపెనీలు ఇప్పటికే ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి కనబర్చిన నేపథ్యంలో పర్యటన విజయవంతానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ వెల్లడించారు. దుబయ్ ఎక్స్ పోలో వివిధ రాష్ట్రాలు హాజరవుతున్నాయని, దుబయ్ లోని ఇండియా పెవిలియన్ భవనంలో 11 నుంచి 17 తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీఈడీబీ సీఈవో, ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది ఈ సందర్భంగా మంత్రి మేకపాటికి వివరించారు. 13 నుంచి 17 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక కార్యక్రమాలను నిర్వహించేందుకు పరిశ్రమల శాఖ ప్రణాళిక చేసిందని ఆయన పేర్కొన్నారు. పెవిలియన్ లో ఎమ్ఎస్ఎమ్ఈ పార్కులు, ఫిషింగ్ హార్బర్లు, విద్య, వైద్యం, పర్యాటకం, ఐ.టీ, పోర్టులు సహా పలు రంగాలపై ఏపీ ప్రత్యేకతను చాటేందుకు చేసిన కసరత్తును మంత్రి ముందు ఏపీఈడీబీ సీఈవో సుబ్రహ్మణ్యం జవ్వాది ప్రజంటేషన్ ఇచ్చారు. దుబయ్ ఎక్స్ పో సన్నద్ధత ఏర్పాట్లలో పరిశ్రమల శాఖ , ఏపీఐఐసీ సమన్వయంతో చేసిన కృషిని మంత్రి గౌతమ్ రెడ్డి అభినందించారు.