మయన్మార్‌లో 7వేల మంది ఖైదీలకు క్షమాభిక్ష.. ఎందుకంటే..?

మయన్మార్ ఆర్మీ 7వేల మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. వీళ్లలో మాజీ మంత్రి థుర అంగ్ కో, ప్రముఖ రచయిత తిన్ లిన్ వూ కూడా ఉన్నారు. ఇవాళ మయన్మార్‌లో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. దాంతో రాజకీయ ఖైదీలుగా ఉన్నవాళ్లలో 7వేల 12 మందిని మయన్మార్ సైన్యం జైలు నుంచి విడుదల చేసింది. అయితే విడుదలైన వాళ్లలో ఆంగ్ సాన్ సూకీ, మాజీ అధ్యక్షుడు విన్ మియింట్ ఉన్నారా? అనేది మాత్రం మయన్మార్ ఆర్మీ వెల్లడించలేదు. థుర, థిన్ లిన్ ఇద్దరూ.. ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వంలో పనిచేశారు. సూకీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీలో తిన్ లిన్ అధికారిగా విధులు నిర్వహించారు. తాను జైలు నుంచి ఇంటికి వచ్చానని.. అయితే ఇది నిజమైన స్వేచ్ఛ కాదు. ఇంటి దగ్గర ఉన్నా ఇప్పటికీ తనకు భయంగానే ఉందని రచయిత తిన్ అన్నారు. ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్న రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై కుట్ర పన్నారని, ప్రజలను రెచ్చగొట్టారనే ఆరోపణల మీద తిన్ లిన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించారు.

మయన్మార్ సైన్యం 2021 ఫిబ్రవరి1న ఆంగ్‌సాన్ సూకీని గద్దెదించింది. ఆమెతో పాటు ఇతర అధికారులు, నిరసనకారులను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆ దేవశంలో అల్లర్లు చెలరేగుతున్నాయి. హింసను విడనాడాలని, రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని పోయిన ఏడాది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి డిమాండ్ చేసింది. అవినీతి ఆరోపణల కేసులో ఆంగ్‌సాన్ సూకీకి మయన్మార్ సైన్యం ఏడేళ్లకు పైగా శిక్ష విధించింది.