హస్తినలో అమరావతి రణగర్జన.. దద్దరిల్లిన ఢిల్లీ వీధులు.. !
దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో అమరావతి నినాదం మార్మోగింది. ఢిల్లీలో ని జంతర్ మంతర్ వద్ద అమరావతి పరిరక్షణ సమితి, రైతు జేఏసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని నినదించారు. టీడీనీ, జనసేన, కాంగ్రెస్, వామపక్ష నేతలు ధర్నాలో పాల్గొన్నారు. ధరణి కోట టు ఎర్రకోట నినాదంతో అమరావతి రైతులు ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టారు. అమరావతి నుంచి పెద్ద సంఖ్యలో వెళ్లిన వారంతా జంతర్ మంతర్ వద్ద ధర్నాలో పాల్గొన్నారు. పలు పార్టీల నేతలు అమరావతి పోరాటానికి ఢిల్లీ వేదికగా మద్దతు ప్రకటించారు. రాజధాని అమరావతి కోసం యుద్దం చేయటానికే ఢిల్లీకి వచ్చామంటూ అమరావతి పరిరక్షణ సమితి నేతలు తేల్చి చెప్పారు.

ఢిల్లీలో అమరావతి రైతుల ఆందోళనకు టీడీపీ ముగ్గురు ఎంపీలు దీక్షకు హాజరయ్యారు. దేశ చరిత్రలో ఇంత సుదీర్ఘంగా రైతుల ఉద్యమం జరగలేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులంటూ రైతులను అవమానించారని, రియల్ వ్యాపారులు ఎక్కడైనా ఇంత సుదీర్ఘంగా రోడ్లపై కూర్చొని ధర్నాలు చేయడం చూశారా అని ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో ముందుకెళ్లాలన్నారు. రాజధానిని మార్చాలంటే రాష్ట్ర విభజన చట్టాన్ని మార్చాల్సి ఉంటుందని, ఆ అధికారం పార్లమెంటుకే ఉంటుందని రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ పేర్కొన్నారు. రాజధానిని మార్చే శక్తి ఎవరికీ లేదన్నారు. రాజధాని ప్రాంత రైతులకు కాంగ్రెస్ పార్టీ న్యాయ సాయం చేస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు హామీ ఇచ్చారు. రైతు కంట తడి పెట్టించిన ఏ ప్రభుత్వం, ఏ నేత బాగుపడలేదని జనసేన నేత హరిప్రసాద్ అన్నారు. అమరావతి రైతుల త్యాగాన్ని తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గుర్తించారని చెప్పారు. ఇక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో అ అంశాన్ని లేవనెత్తనున్నట్లు ప్రకటించారు. విశాఖకు రాజధాని తరలే ప్రసక్తే లేదని నేతలు అమరావతి రైతులకు అభయం ఇచ్చారు. ప్రధాని మోదీ మోసం చేసారని ఆరోపించారు. రైతుల పోరాట స్పూర్తిని నేతలు అభినందించారు.