కోకాపేట్ భూముల వేలం పై వివరణ ఇచ్చిన ప్రభుత్వం

కోకాపేట భూముల వేలంపై ఆరోపణలు నిరాధారం : తెలంగాణ ప్రభుత్వం వివరణ

హైదరాబాద్‌:

కోకాపేట, ఖానామెట్‌ భూముల వేలంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఈ భూముల వేలంపై ఆరోపణలు నిరాధారమని స్పష్టంచేసింది. ఈ మేరకు ఆరు పేజీలతో కూడిన వివరణతో ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘‘భూముల వేలం పారదర్శకంగా జరిగింది. వేలంలో పాల్గొనకుండా ఎవరినీ నియంత్రించలేదని పేర్కొంది. ఎవరైనా ఒక బిడ్‌ను ప్రభావితం చేస్తారనేది కేవలం అపోహే అని ప్రకటనలో తెలిపింది. . ఆన్‌లైన్‌లో 8 నిమిషాల పాటు వేలం పాటకు అవకాశం కల్పించామని… 8 నిమిషాలు ఎవరూ ఆసక్తి చూపకపోతేనే బిడ్‌ని ఖరారు చేశామని పేర్కొనింది. ప్లాట్ల ధరల్లో వేర్వేరు ధరలు ఉండటంలో ఆశ్చర్యంలేదని… భూముల వేలానికి స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతి సరికాదని తెలిపింది. ఈ పద్ధతి పోటీని కొందరికే పరిమితం చేస్తుందని తెలిపింది. ఇకముందు ఇలాంటి ఆరోపణలు చేస్తే పరువు నష్టం చర్యలు తీసుకుంటామని పేర్కొంది. వేలం గురించి నెల రోజులుగా ప్రచారం చేస్తున్నామని తెలిపింది. పోటీని నివారించారని, రెవెన్యూ తగ్గించారనే ఆరోపణలు నిరాధారమని తెలిపింది. కొన్ని సంస్థలకే మేలు చేశారన్న ఆరోపణలు కూడా నిరాధారమైనవి’’ అని ప్రభుత్వం పేర్కొంది.

తెలంగాణ ప్రభుత్వం తరుపున హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ ఇటీవల చేపట్టిన భూముల వేలంలో విధానపరమైన అవకతవకలు జరిగినట్టు కొన్ని వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలపై రికార్డుల ఆధారంగా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. ‘‘నివాస, వాణిజ్య, సంస్థాగత, ప్రజా అవసరాలకు సంబంధించి ఈ భూములను వేలం వేయడం గతంలో ఉమ్మడి ఏపీలో, దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతున్నదని వివరణ ఇచ్చింది. డిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీలాంటి రాష్ట్రాల్లోనూ ఇలాంటి ప్రక్రియ నిరంతరం జరుగుతోందని పేర్కొంది. రెవెన్యూ సముపార్జనే లక్ష్యంగా కనిపిస్తున్నప్పటికీ పట్టణాల్లో ప్రణాళికాబద్ధమైన వృద్ధి, రోజురోజుకీ పెరుగుతున్న నివాస, వాణిజ్య సంబంధమైన అవసరాలను తీర్చడమే ముఖ్య ఉద్దేశం’’ అని తెలిపింది.

‘‘నగరాభివృద్ధికి దోహదపడే అత్యంత వ్యూహాత్మక ప్రాంతాలైన కోకాపేట్‌, ఖానామెట్‌ భూముల వేలం ఇదివరకే జరిగిందని ప్రకటన లో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇది ఒక కొనసాగింపు ప్రక్రియే. జులై 15, 16తేదీల్లో జరిగిన వేలంలో కోకాపేటలో 49.45 ఎకరాల భూమిని 8 ప్లాట్లుగా, ఖానామెట్‌లో 15.01 ఎకరాల భూమిని 5 ప్లాట్లుగా వేలం వేశామని తెలిపింది.. ఈ వేలం పాటను నిపుణులైన భారత ప్రభుత్వరంగ సంస్థ ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌, ఈ- ఆక్షన్‌ ఆధారిత ఆన్‌లైన్‌ బిడ్‌ పద్ధతి ద్వారా అత్యంత పారదర్శకంగా నిర్వహించామని తెలిపింది.. దీంట్లో ఎలాంటి సంశయాలకూ తావులేదు’’అని తెలిపింది.

‘‘కోకాపేట, ఖానామెట్‌ భూముల వేలంలో పోటీని నివారించామని, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ తగ్గించామన్న ఆరోపణలన్నీ నిరాధారమని విడుదల చేసిన లేఖలో పేర్కొంది. బిడ్డింగ్‌లో కొన్ని సంస్థలకే మేలు చేశామన్న ఆరోపణలూ ఊహాతీతమైనవని పేర్కొంది.
వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా, ఇలాంటి పారదర్శకమైన పద్ధతిని తప్పుపట్టడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలకు పాల్పడటాన్ని ఊపేక్షించబోమని హెచ్చరించింది. ఇకముందు ఇలాంటి కల్పిత ఆరోపణలపై న్యాయపరమైన పరువు నష్టం చర్యలు తీసుకోవడం జరుగుతుంది’’ అని ప్రభుత్వం హెచ్చరించింది.

మరోవైపు, కోకాపేట భూముల వేలంలో రూ. 1000కోట్ల అవినీతి జరిగిందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. నిన్న కోకాపేట భూముల సందర్శనకు కాంగ్రెస్‌ పిలుపునివ్వగా ఆ పార్టీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేసిన విషయం తెలిసిందే. వేలం ఆరోపణలపై స్పందించిన ప్రభుత్వం ఈ భూముల వేలంపై ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు నిరాధారమని తేల్చి చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *