తిరుమలలో జరిగే కార్యక్రమాలన్నింటినీ హైదరాబాద్ టీటీడీ ఆధ్వర్యంలోని రెండు ఆలయాల్లో నిర్వహిస్తాం : టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలన్నింటినీ హైదరాబాద్ హిమాయత్ నగర్ ,జూబ్లీహిల్స్ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీటీడీ హైదరాబాద్ స్థానిక సలహా మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టీటీడీ పాలకమండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
స్థానిక సలహా మండలిలోని 24 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ముగ్గురు ఉపాధ్యక్షులు ఉన్నారు. స్థానిక సలహా మండలి ఛైర్మన్ జివి భాస్కర్ రావు, ఏ ఈవో జగన్మోహనాచార్యులు పాల్గొన్నారు.
అనంతరం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో టీటీడీ మరింత పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు. గుడికో గోమాత కార్యక్రమం అన్ని ముఖ్య ఆలయాలకు అమలు చేసి, గో పూజ అందుబాటులోకి వచ్చేలా స్ధానిక సలహా మండలి కృషి చేయాలని ఆయన కోరారు. తెలంగాణలో ఇప్పటి వరకు 30 ఆలయాలను టీటీడీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశామని ఈ ఏడాది లోగా మరో 70 ఆలయాలను పునరుద్ధరించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.