శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల కోసం ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలి: టిటిడి జెఈఓ వీరబ్రహ్మం

తిరుపతి :

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి జెఈఓ శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన అధికారులతో కలిసి అమ్మవారి ఆలయం, పుష్కరిణి, హైస్కూల్ పరిసరాలు, పసుపు మండపం, పూడిరోడ్డు తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన చక్రస్నానం నాడు విశేషంగా వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం పూడి రోడ్డు, రేణిగుంట, మార్కెట్ యార్డ్ ప్రాంతాల్లో స్థలాలను సిద్ధం చేయాలన్నారు. అదే విధంగా భక్తులు సేదతీరేందుకు నవజీవన్ కంటి ఆసుపత్రి, హైస్కూలు, గోశాల వద్ద జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరిణిలోకి వెళ్లేందుకు, తిరిగి వెలుపలికి వచ్చేందుకు తగిన విధంగా గేట్లు ఏర్పాటు చేయాలన్నారు. తమిళనాడు భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున తమిళంలో సైన్ బోర్డులు సిద్ధం చేయాలన్నారు. తిరుమల నుంచి పసుపు ఊరేగింపు మార్గాలను ముందే పరిశీలించి ఆ మార్గంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా ఈ ఊరేగింపులో ఏనుగులు బెదరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం ఎస్ఇ సత్యనారాయణ ,ట్రాన్స్పోర్ట్ జిఎం శేషారెడ్డి, ఇఇ మనోహర్, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *