బీహార్లో కల్తీ మద్యం కలకలం.. 50కి చేరిన మృతుల సంఖ్య
బీహార్లో కల్తీమద్యం మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 50 మందికి పైగా మరణించినట్లు అధికారులు తెలిపారు. మరికొందరి పరిస్థితి ఆందోళన కరంగా ఉందని వెల్లడించారు. శరన్ జిల్లా ఛాప్రా ప్రాంతంలో వీరంతా మద్యం సేవించారు. అక్కడినుంచి ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ప్రాణాలు కోల్పోయారు. కల్తీ మద్యం మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతుండటంతో ప్రతిపక్ష బీజేపీ మహాఘట్బంధన్ సర్కారుపై ఒత్తిడి పెంచింది. దీనిపై నేడు గవర్నర్ను కలవాలని బీజేపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. బీహార్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.

ఘటనపై ప్రతిపక్షాల ఆందోళనలతో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఉక్కిరిబిక్కిరౌతున్నారు. మద్యం తాగితే చస్తారని ఆయన మందుబాబులకు హెచ్చరికలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందించేందుకు కూడా ఆయన నిరాకరించారు. బీహార్ లో 2016 నుంచి మద్యనిషేధం అమల్లో ఉండటంతో.. ఈ ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. సీఎం నితీశ్ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ విపక్షాలు జరుపుతున్న ఆందోళనలతో అసెంబ్లీ లోపల, బయటా తీవ్ర ప్రకంపనలు రేగాయి. నితీశ్ రాజీనామా చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపల ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో సభ స్తంభించిపోయింది. ఒకదశలో నితీశ్ సహనం కోల్పోయారు. తాగొచ్చి సభలో అల్లరి చేస్తున్నారా? అంటూ బీజేపీ సభ్యులపై ఆయన మండిపడ్డారు. కాగా, పోలీసులు, కల్తీ మద్యం వ్యాపారుల మధ్య లాలూచీ ఫలితంగానే తరచూ జనం చనిపోతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు.