వరుసగా రెండో సారి ఐర్లాండ్ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి

ఐర్లాండ్‌ ప్రధానిగా భారత సంతతికి చెందిన లియో వరాద్కర్‌ రెండో సారి బాధ్యతలు చేపట్టారు. ఫిన్‌గేల్‌ పార్టీకి చెందిన ఈయన 2017లో తొలిసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. అయితే 2020లో ఫిన్‌గేల్‌, మార్టిన్‌ ఫియన్నాఫెయిల్‌ పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు రోటేషన్‌ పద్ధతిలో వరాద్కర్‌కు మరోసారి అవకాశం వచ్చింది. మైఖేల్‌ మార్టిన్‌ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. 43 ఏళ్ల వరాద్కర్‌ ఐర్లాండ్‌లోని అత్యంత తక్కువ వయస్సున్న ప్రధానిగా గతంలోనే చరిత్ర సృష్టించారు. రెండోసారి ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 100 ఏళ్లలో సాధించిన అభివృద్ధి ఆధారంగా రానున్న తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాలన సాగిస్తానన్నారు. అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రచించి పక్కాగా అమలుపరుస్తానని చెప్పారు. కొవిడ్‌ లాంటి కీలక సమయంలో తనకు సహకారం అందించిన మైఖేల్‌ మార్టిన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నాయకత్వ మార్పిడి ప్రక్రియ డిసెంబరు 15నే జరగాల్సి ఉంది. కానీ, ప్రధాని మార్టిన్‌ యూరోపియన్‌ యూనియన్‌ నేతల సమావేశానికి వెళ్లడం వల్ల వాయిదా పడింది. మరోవైపు ఐర్లాండ్ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన లియో వరాద్కర్​కు భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. భారత్​, ఐర్లాండ్ మధ్య చారిత్రక సంబంధాలు, రాజ్యాంగ విలువలు, బహుముఖ సహకారాన్ని తాము విలువైనదిగా భావిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *