పసిపాపకు రైల్వేశాఖలో ఉద్యోగం

రైల్వేలో (Indian Railways) ఉద్యోగం రావాలంటే అంత ఈజీ కాదు. అందుకోసం ఎంతో కష్టపడాలి. ముందుగా.. రైల్వేలో ఉన్న ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ రావాలి.వాటికి దరఖాస్తు చేయాలి. రాత పరీక్ష పాసవ్వాలి. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుంది. ఇవన్నీ జరగాలంటే.. విద్యార్హతలు ఉండాలి. ఉద్యోగ పరీక్షకు బాగా సన్నద్ధమవ్వాలి. కానీ ఇలాంటివేవీ లేకుండానే.. పది నెలల బాలికకు
రైల్వే డిపార్ట్‌మెంట్‌ లో (Railway Job)ఉద్యోగం ఖరారయింది. 10 నెలల బాలికకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమా? అని ఆశ్చర్యపోకండి. ఇందుకు ఓ ప్రత్యేకమైన..బలమైన.. కారణముంది.

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని రాయ్‌పూర్ రైల్వే డివిజన్ (Raipur Railway Divison ) కార్మిక విభాగం.. రైల్వేలో ఓ 10 నెలల పసిపాప నియామకం కోసం రిజిస్ట్రేషన్ పూర్తిచేసింది. ఇంత చిన్న వయసున్న పిల్లల నియామకానికి రిజిస్ట్రేషన్ జరగడం రాయ్‌పూర్ డివిజన్ చరిత్రలో ఇదే తొలిసారి. వాస్తవానికి ఈ అమ్మాయి తండ్రి రాజేంద్ర కుమార్..
ఛత్తీస్‌గఢ్ భిలాయ్‌లోని పీపీ యార్డ్‌లో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఐతే ఆయన జూన్ 1న మందిర్ హసౌద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రాజేంద్రకుమార్, ఆయన భార్య, కూతురు బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బాలిక తల్లిదండ్రులిద్దరు చనిపోయారు. నిబంధనల ప్రకారం రాయ్‌పూర్ రైల్వే డివిజన్ అధికారులు రాజేంద్ర కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. ఇటీవల రాజేంద్రకుమార్ స్థానంలో ఆయన కూతురి కారుణ్య నియమకానికి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేశారు. కారుణ్య నియామకాల నమోదు ప్రక్రియ కోసం ఇటీవల రైల్వే అధికారులు బాలిక ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం ఆమె తన అత్తామామలు, తాతతో నివసిస్తోంది. ఆమె పెద్దయ్యాక రైల్వేలో ఉద్యోగం ఇస్తామని అధికారులు వారికి వివరించారు. 18 ఏళ్ల వయసు వచ్చాక.. జాబ్ అలాట్‌మెంట్ ఉంటుందని తెలిపారు. అనంతరం కారుణ్య నియామకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేశారు.

సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ ఉదయ్ కుమార్ భారతి మాట్లాడుతూ..కారుణ నియామక రిజిస్ట్రేషన్ పక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు. ఆ పది నెలల పాప వేలి ముద్ర వేయడం కూడా కష్టంగా మారిందని.. ఐనప్పటికీ పాప కోసం ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు వివరించారు. ఆమె భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రైల్వేలో ఉద్యోగం కన్ఫర్మ్ చేసినట్లు వెల్లడించారు. మెజారిటీ వచ్చిన తర్వాత ఆ బాలిక.. రైల్వే విధుల్లో చేరుతుంది. డ్యూటీలో చేరిన అనంతరం… ఆమెకు ఇతర సిబ్బందిలాగే జీతం, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. చిన్నారికి రైల్వేలో ఉద్యోగాన్ని ఖరారు చేసినందుకు ఆమె కుటుంబ సభ్యులు రైల్వే అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *