సాగునీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకూడదు: సీఎం కేసీఆర్
తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాల్సిన తెలంగాణ అంశాలు, సమస్యలపై సిఎం కెసిఆర్ ఎంపిలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలు అంశాలు చర్చకువచ్చాయి. ముఖ్యంగా
సాగునీటి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వకూడదని సిఎం కెసిఆర్ ఎంపీలకు స్పష్టం చేశారు. లోక్ సభ, రాజ్యసభల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటివాటాకోసం కేంద్రాన్ని నిలదీయాలని, గట్టిగా కొట్లాడాలని సూచించారు. విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా, రాష్ట్రానికి సంబంధించిన పెండింగు సమస్యల పరిష్కారం కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలని సిఎం తెలిపారు. సంబంధిత కేంద్ర మంత్రులను కలుస్తూ వినతిపత్రాలను అందచేయాలని సిఎం ఎంపీలకు సూచించారు. రాష్ట్రానికి సంబంధించిన ఫౌర సంబంధాల శాఖ సమస్యలు పెండింగులో ఉన్నాయని, వాటిని పరిష్కరించుకునే దిశగా సంబంధిత మంత్రిని కలువాలని పార్టీ పార్లమెంట్ సభ్యులను సిఎం కెసిఆర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో.. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్., టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీనేత కె.కేశవరావు, లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వర్ రావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, జోగినపల్లి సంతోష్ కుమార్, కె ఆర్ సురేశ్ రెడ్డి, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్, లోక్ సభ సభ్యులు బి.బి పాటిల్, పోతుగంటి రాములు, కొత్త ప్రభాకర్ రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, బి.వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.