రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు వాయిదా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాలకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతుల ప్రక్రియను వాయిదా వేసింది. ఇటీవల తెలంగాణ పభుత్వం కేంద్రం, కృష్ణా జలాల ట్రైబ్యునల్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి 6 అంశాలపై కేంద్ర పర్యావరణశాఖ ఏపీ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఎన్జీటీ అభ్యంతరాలకు వివరణ ఇవ్వాలని, ప్రాజెక్టు డ్రాయింగ్స్, లే అవుట్లు, చార్టుల వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రాజెక్టు ద్వారా ఎంత నీరు వాడుకుంటారో స్పష్టం చేయాలని ఏపీని కోరింది.గతంలో తెలుగుగంగకు ఇచ్చిన అనుమతులలో ఏపీ ప్రభుత్వం పలు సవరణలు కోరగా.. సవరణలు కోరుతూ ఇచ్చిన దరఖాస్తులో స్పష్టత లేదని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది. ప్రాజెక్టు సవరణల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు స్పష్టత లేదని తెలిపింది.