ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్‌ లేఖ

*ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్‌ లేఖ*

*ఐఏఎస్‌ కేడర్‌ రూల్స్‌-1954 సవరణలకు మేం మద్దతిస్తున్నాం : ముఖ్యమంత్రి జగన్*

*ఆల్ ఇండియా సర్వీసు రూల్స్ సవరణలపై ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. ఐఏఎస్‌ కేడర్‌ నిబంధనల్లో సవరణలకు మద్దతిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రాల అంగీకారం లేకుండానే కేంద్రం అధికారులను డెప్యుటేషన్​కు తీసుకెళ్లే అంశంపై ఓమారు ఆలోచించాలని సీఎం కేంద్రాన్ని కోరారు. అకస్మాత్తుగా ఐఏఎస్​లను డెప్యుటేషన్​కు వెళ్లేందుకు రిలీవ్ చేయాల్సివస్తే.. కీలకమైన ప్రాజెక్టులు, పథకాల లక్ష్యాలు దెబ్బతింటాయని లేఖలో వెల్లడించారు. ఐఏఎస్‌లను డిప్యుటేషన్‌పై పంపేందుకు సరిపడా అధికారులు లేరన్న సీఎం.. ఎక్కువ మంది అధికారులను కేటాయిస్తే డిప్యుటేషన్‌పై పంపొచ్చని తెలిపారు. కేంద్ర డెప్యుటేషన్​కు వెళ్తామని అభ్యర్ధించే ఐఎఎస్​లకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్​ఓసీ జారీ చేస్తోందని అన్నారు.*

*ఐఏఎస్‌ కేడర్‌ రూల్స్‌-1954కు మార్పులు..రాష్ట్ర కేడర్‌ నుంచి వచ్చి కేంద్రంలో డిప్యుటేషన్‌పై పనిచేసే అధికారుల సంఖ్య తగ్గిపోతుందని పేర్కొంటూ ఐఏఎస్‌ కేడర్‌ రూల్స్‌-1954కు మార్పులను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పటి వరకూ పరస్పర సంప్రదింపుల ద్వారా కేంద్రం, రాష్ట్రాలు అధికారుల డిప్యుటేషన్‌కు అనుమతులిచ్చేవి. అయితే, తాజా ప్రతిపాదన ప్రకారం.. ఏ అధికారినైనా డిప్యుటేషన్‌పై పంపించాలని కేంద్రం కోరితే ఆ అభ్యర్థనను తోసిపుచ్చే అవకాశం ఇక రాష్ట్రాలకు ఉండదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలు తెలపాలని కోరుతూ గత ఏడాది డిసెంబరు 20, 27, ఈ ఏడాది జనవరి 6,12 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్రం లేఖలు రాసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఐఏఎస్‌ కేడర్‌ నిబంధనల మార్పుపై ఇప్పటి వరకు 18 రాష్ట్రాలు తమ స్పందనలను తెలియజేశాయి. వాటిలో 9 రాష్ట్రాలు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించగా మరో 9 రాష్ట్రాలు సమర్థించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కేంద్రం ప్రతిపాదనకు సానుకూలత తెలపగా… తెలంగాణ మాత్రం కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించకపోవడం గమనార్హం.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *