నిర్మాణ వ్యర్థాల రహిత నగరంగా హైదరాబాద్
భవన నిర్మాణ వ్యర్థాల రహిత నగరం గా గ్రేటర్ హైదరాబాద్ మారబోతోంది. హైదరాబాద్
నాగోల్ ఫతుల్లాగూడ లో జీహెచ్ఎంసీ నూతనంగా ఏర్పాటు చేసిన సి అండ్ డి ప్లాంట్ ను మంత్రి కేటీఆర్ రేపు ప్రారంభించనున్నారు.
ఇప్పటికే జీడిమెట్లలో అత్యాధునిక యంత్రాలతో ఏర్పాటు చేసిన మొదటి భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంట్ ను గత సంవత్సరం నవంబర్ మాసంలో మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ప్రారంభించారు. దక్షణ భారత దేశంలోనే జీడిమెట్ల ప్లాంట్ అతి పెద్దది . భారత దేశంలోనే ఐదవ పెద్ద ప్లాంట్… ఫతుల్లాగూడ ఫ్లాంట్ .ఈ ఫ్లాంట్ లో రోజుకు 500 టన్నుల నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే సామర్థ్యం ఉంది.
దేశంలో న్యూఢిల్లీ, అహ్మదాబాద్, సూరత్, విశాఖపట్నం నగరాలతో పాటు సి అండ్ డి ప్లాంట్ ను కలిగి ఉన్న ఐదో నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందింది.వెట్ ప్రాసెసింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ సి అండ్ డి ప్లాంట్ నిర్వహణలో ఏవిధమైన దుమ్ము, దూళీ బయటకు రాదు. తెలంగాణ రాష్ట్రం వ్యర్థ పదార్థాల నిర్వహణలో దేశానికే ఆదర్శంగా ఉండాలన్న ముఖ్యమంత్రి కే.సి.ఆర్ సంకల్పానికి అనుగుణంగా హైదరాబాద్ నగరంను అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రహదారుల వెంట ఎక్కడా కూడా భవన, నిర్మాణ వ్యర్థాలు కనిపించకూడదని, ఆ వ్యర్థాలను సేకరించి రీ-సైక్లింగ్ చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదేశించడంతో హైదరాబాద్ నగరం నాలుగు వైపులా సీ అండ్ డీ ప్లాంట్ లను ఏర్పాటు చేయడానికి జీహెచ్ఎంసీ ప్రణాళికలు రూపొందించింది.
తొలిదశలో జీడిమెట్ల, ఫతుల్లాగూడా లలో స్థల సేకరణ జరిపి ఈ ప్లాంట్ లను ఏర్పాటు చేశారు.
ఒక్కో ప్లాంట్ లో రోజుకు 500 టన్నుల నిర్మాణ వ్యర్థాలను రీ-సైక్లింగ్ చేస్తారు. ఈ రీసైక్లింగ్ వల్ల నిర్మాణ వ్యర్థ పదార్థాలలో 90 శాతానికి పైగా తిరిగి ఉపయోగపడేలా సన్న ఇసుక, దొడ్డు ఇసుక, కంకర, రాయి ఇలా వేర్వేరుగా వస్తాయి. నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ లో 80 – 20 సైజు కంకర 30 శాతం, ముడి ఇసుక 20 శాతం, ముతక ఇసుక 20 శాతం, దొడ్డు కంకర 25 శాతం వస్తాయి. ఈ వేరుచేసిన ఈ మెటీరియల్స్ తో పేవర్ బ్లాక్స్, పార్కింగ్ టైల్స్, ఫుట్ పాత్ టైల్స్ వంటివి తయారు చేస్తారు. ఈ టైల్స్ బయట మార్కెట్ లో దొరికే వాటికన్నా నాణ్యతతో పాటు ధర కూడా 30 కన్నా తక్కువగా ఉంటాయి. ఈ మెటీరియల్స్ ఫుట్ పాత్, ఫ్లోరింగ్ నిర్మాణానికి ఉపయోగ పడతాయి.2018 ఏప్రిల్ నుండి పనిచేయడం ప్రారంభించిన జీడిమెట్ల ప్లాంట్ ఇప్పటి వరకు 13.35 లక్షల మెట్రిక్ టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించగా.2021 ఏప్రిల్ మాసం నుండి నిర్వహణ ప్రారంభించిన ఫతుల్లాగూడ ప్లాంట్ ద్వారా 7.97 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను సేకరించారు.
గ్రేటర్ హైదరాబాద్ లో రోజుకు దాదాపు రెండు వేల టన్నులకు పైగా నిర్మాణ వ్యర్థాలు వస్తున్నాయి. ఈ వ్యర్థాలను అర్ధరాత్రి సమయాలలో రోడ్ల వెంట, చెరువుల్లో అక్రమంగా డంపింగ్ చేస్తున్నారు. దీనిని కూడా నివారించేందుకు ఎక్కడైనా నిర్మాణ వ్యర్థాలు ఉంటె ఈ వ్యర్థాలను తరలించేందుకై జీ.హెచ్.ఎం.సి ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. టన్ను వ్యర్థానికి రూ. 342 చెల్లిస్తే ఇంటి వద్దకే వాహనం వచ్చి తీసుకెళ్లే ఏర్పాట్లను చేసింది. ఈ విధమైన సి అండ్ డి ప్లాంట్ లను నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి జిహెచ్ఎంసి ప్రణాళికలు రూపొందించింది.
Good information