తెలంగాణ లాజిస్టిక్స్ పాలసికి ఆమోదం తెలిపిన మంత్రి వర్గ సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక, ఈ కామర్స్, సేవా రంగాలలో దినదినాభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో, అందుకనుగుణంగా లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది.అందులో భాగంగా పరిశ్రమలు ,వాణిజ్య శాఖ రూపొందించిన తెలంగాణ లాజిస్టిక్స్ పాలసిని కేబినెట్ ఆమోదం తెలిపింది.కరోనా నేపథ్యంలో, బయట తిరగలేని పరిస్థితుల్లో ప్రజలకు వస్తు సేవలు అందుబాటులోకి రావడానికి లాజిస్టిక్స్ రంగం ఎంతగానో ఉపయోగ పడ్డదని కేబినెట్ గుర్తించింది.

అంతర్జాతీయ ఈ కామర్స్ సంస్థలు లాజిస్టిక్ రంగాన్ని వినియోగించుకుని ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తున్నాయని గుర్తించింది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక , వ్యవసాయ అభివృద్దిలో ఆయా ఉత్పత్తులను దేశ విదేశీ వినియోగదారుల చెంతకు చేర్చడానికి లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించడం తక్షణావసరమని కేబినెట్ అభిప్రాయపడింది.వ్యవసాయ రంగంలో సాధించిన అభివృద్ధి తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా సాధించే అధనపు వాణిజ్యానికి లాజిస్టిక్ రంగాభివృద్ధి ఎంతో అవసరం అని మంత్రి వర్గం గుర్తించింది.
రాష్ట్రంలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, డ్రై పోర్టులు, ట్రక్ డాక్ పార్కింగ్ సహా తదితర లాజిస్టిక్స్ రంగాల్లో మౌలిక వసతులను మెరుగు పరచాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో సుమారుగా 1400 ఎకరాల్లో భారీ స్థాయిలో డ్రై పోర్టును (మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కును) పీపీపీ పద్దతిలో ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.రాష్ట్రంలో ఎగుమతులను మరింతగా ప్రోత్సహించడానికి కస్టమ్స్ శాఖ అనుసంధానంతో, సనత్ నగర్ లో ప్రస్థుతమున్న కాంకర్ ఐసిడి తరహాలో కొత్తగా మరో రెండు ఇంటిగ్రేటెడ్ కంటేనర్ డిపో (ఐసీడీ)లను స్థాపించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
బాటసింగారంలో ఏర్పాటు చేసిన మాదిరి, రాష్ట్రవ్యాప్తంగా మరో 10 ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కులను నెలకొల్పడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రంగంలో నైపుణ్యాభివృద్ది పెంపొందించడం కోసం అంతర్జాతీయ స్థాయిలో టాస్క్ సహాయంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను స్థాపించాలని కేబినెట్ నిర్ణయించింది.
అన్నిరకాల రంగాలకు చెందిన వస్తువుల నిల్వ సామర్ధ్యం పెంచుకోవడానికి లాజిస్టిక్స్ పాలసీ చేయూతనిస్తుందని కేబినెట్ అభిప్రాయ పడింది.
తెలంగాణ లాజిస్టిక్స్ పాలసీలో లో భాగంగా… రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, వేర్ హౌజ్ లను ఏర్పాటు చేసే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పలు రకాల ప్రోత్సహకాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. తద్వారా.. రాష్ట్ర వ్యాప్తంగా లాజిస్టిక్స్ రంగాభివృద్ధి ద్వారా పత్యక్షంగా 1 లక్ష మందికి, పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని, అందుకోసం గాను రాష్ట్రానికి దాదాపు 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖకు కేబినెట్ సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *