తెలంగాణలో పల్లె పట్నం ప్రగతి ప్రస్థానం

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా, పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించే ఉద్దేశంతో చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమం మూడు విడతలుగా జరిగింది.  మొదటి విడత 6 సెప్టెంబర్, 2019 నుంచి 5 అక్టోబర్, 2019వరకు నెలరోజుల జరిగింది. రెండో విడత  02 జనవరి, 2020 నుంచి 12 జనవరి, 2020 వరకు కొనసాగింది.
మూడో విడత 1 జూన్, 2020 నుంచి 8 జూన్, 2020 వరకు జరిగింది.
పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు సమకూరుస్తున్నది. పల్లె ప్రగతి  కార్యక్రమాల వల్ల తెలంగాణలోని పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయి. దేశంలో ఏ పల్లెకూ లేని విధంగా రాష్ట్రంలోని ప్రతి పల్లెలోనూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వ. పల్లె ప్రగతిలో.. తెలంగాణలోని అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు, డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, కల్లాలు సమకూరాయి. ఇది దేశంలో మరే రాష్ట్రంలోనూ జరగలేదు. ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. పల్లె ప్రగతి నిర్వహణకు మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించడం , ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్, ఎంపీటీసీ, కార్యదర్శి, వార్డు మెంబర్లు, లైన్ మెన్, మిషన్ భగీరథ ప్రతినిధులను సభ్యులుగా కమిటీలు  ఏర్పాటయ్యాయి.
హరిత హారంలో నాటే మొక్కలు రోడ్లకు ఇరువైపులా స్వాగతం పలికినట్లు గా రూపుదిద్దుకున్నాయి.
జులై 1 నుంచి 10వ తేదీ వరకు 4వ విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం

పల్లెలు, పట్టణాలు, పచ్చతోరణాలుగా కళకళలాడాలనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  సంకల్పంచారు.సీఎం  సంకల్పంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతలుగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టి, విజయవంతంగా పూర్తి చేసింది..

పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ద్వారా కరోనా కట్టడి

ఇప్పటివరకు ఇతర రాష్ట్రాలకన్నా తెలంగాణలో కరోనా కట్టడిలో ఉండటానికి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలే ప్రధాన కారణం.కరోనా క‌ట్ట‌డికి స్వీయ నియంత్ర‌ణ‌, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ ఒక్కటే మార్గం.క‌రోనా రాష్ట్రంలోకి రావ‌డానికి ముందే చేపట్టిన.. ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాలు తెలంగాణ‌ని అద్దంలా మార్చాయని చెప్పడంలో సందేహం లేదు. వీటికి కొన‌సాగింపుగా ప్రభుత్వం ప్ర‌త్యేక పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు నిర్వహించిది.దీంతో కరోనా వ్యాప్తి, కోవిడ్ పాజిటివ్ రేటు మన రాష్ట్రంలో తక్కువగానే ఉన్నది. పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరంగా జరగడంతో పల్లెలు, పట్టణాలన్నీ పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి.దీంతో కరోనా నుంచి ప్రజలు త్వరగానే కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు కూడా ఇతర రాష్ట్రాలకంటే తెలంగాణలో ఎక్కువగా నమోదైంది. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, ఆవాసాల్లో ఈ కార్యక్రమాలను చేపట్టడానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు సమాయత్తమయ్యారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను  నియమించింది.
పారిశుధ్యం, ఆరోగ్యం, మౌలిక వసతులు, హరితహారంలో ఇంటింటికీ ఆరు మొక్కల పంపిణీ, విద్యుత్ సమస్యల పరిష్కారం, ప్రజల భాగస్వామ్యం మొదలైన కార్యక్రమాల్ని ప్రజా ప్రతినిధులతో కలిపి పెద్దఎత్తున చేపట్టాలని  ప్రభుత్వం నిర్ణయించింది

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి దార్శనికత హరిత విప్లవాన్ని తలపిస్తోంది. పక్షుల కిలకిలరావాలతో గుజ్జనగూళ్లు కట్టి, ఉద్యాన వనాలు హరిత శోభితంగా మారుతున్నాయి.
హరితహార ఫలాలు కాలుష్యాన్ని తగ్గిస్తున్నాయి.
సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాలు పచ్చని చెట్లతో వేడిని తగ్గించి చల్లదనాన్ని పంచుతున్నాయి.పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా జరిగాయి.పారిశుధ్యం బాగుండి, ప్రజలు అంటురోగాల బారిన పడకుండా నిరోధించినట్లయింది.కరోనా మహమ్మారి నుంచి కోలు కొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతున్నట్లు వైద్యనివేదికలు తెలుపుతున్నాయి.

పల్లె ప్రగతి సైన్యం (8,20,727) :

పల్లె ప్రగతి కింద దేశంలోనే తొలిసారిగా 12,769 గ్రామాల్లో ప్రజలే భాగస్వాములుగా స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు.  వీరిలో 4,03,758 మంది మహిళలు కూడా సభ్యులుగా ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఇస్తున్న నిధులతో పంచాయతీలకు కొత్తరూపు వస్తున్నది. ప్రతి చిన్నపంచాయతీకి కూడా ప్రభుత్వ రూ.5 లక్షల నిదులు ఇచ్చింది. పల్లె ప్రగతిలో ప్రతినెలా రూ.339 కోట్లు విడుదల చేశారు. ఇలా రాష్ట్రంలోని 3479 పంచాయతీలకు  రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నిధులు ఇచ్చారు. 1025 గ్రామాలకు రూ. 1 కోటి వరకు, 164 గ్రామాలకు రూ. 1 కోటి పైన నిధులు కేటాయించారు. 

రాష్ట్రంలో 12, 769 గ్రామ పంచాయతీలకు గాను 19 వేల 298 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాల్లో రెండు చొప్పున అదనంగా 7 వేల పల్లెల్లో ప్రకృతి వనాలు ఏర్పాటయ్యాయి.
రాష్ట్రంలో మొత్తం 15 కోట్ల పనిదినాలు కల్పించాం. తెలంగాణ ఏర్పడిన నాడు  రాష్ట్రంలో కేవలం 84 గ్రామ పంచాయతీలకు మాత్రమే సొంతంగా ట్రాక్టర్లు ఉండేవి. కానీ, నేడు 12,769 గ్రామ పంచాయతీలకు ట్యాంకర్లు, ట్రాలీలతో కూడిన ట్రాక్టర్లు సమకూరాయి. గతంలో అడవులు నరకడమే తప్ప పెంచడమనే మాటేలేదు. కానీ నేడు తెలంగాణ పల్లెల్లో పచ్చదనం వెల్లివిరుస్తున్నది. పచ్చదనం – పరిశుభ్రత విషయాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రతి ఊళ్లో నేడు నర్సరీ ఏర్పాటైంది. రాష్ట్రవ్యాప్తంగా 12,755 నర్సరీలు ఉన్నాయి.
గ్రామాల్లో మొక్కలు పెట్టి, వాటిని సంరక్షించే పనులు జరుగుతున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో నాటిన మొక్కల్లో 91శాతం బతికాయి.
ప్రతి గ్రామానికి ఓ ఉద్యానవనం ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
రాష్ట్రంలోని 19,470 ఆవాస ప్రాంతాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అన్ని చోట్ల వేగంగా పనులు జరుగుతున్నాయి.రైతులు కూర్చొని చర్చించుకోవడానికి గతంలో ఓ వేదిక అంటూ లేదు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని క్లస్టర్ కు ఒకటి చొప్పున రైతు వేదికలను నిర్మిస్తున్నది.
రాష్ట్రంలో మొత్తం 2,601 చోట్ల రైతు వేదికలు నిర్మాణం జరిగింది.రాష్ట్రవ్యాప్తంగా 12,736 గ్రామాల్లో డంప్ యార్డుల పనులు పూర్తయ్యాయి.  
9,023 చోట్ల డంపింగ్ యార్డుల్లో కంపోస్ట్ తయారీ జరుగుతున్నది. గతంలో స్మశానవాటికలు లేక సొంతస్థలం లేనివారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ దుస్థితిని నివారించడానికి ప్రభుత్వం ప్రతి గ్రామంలో వైకుంఠధామం నిర్మిస్తున్నది.రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం జరుగుతున్నది. రైతులు తమ పంటలను ఎండబెట్టడానికి, నూర్పడానికి వీలుగా అన్ని గ్రామాల్లో  కల్లాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా మొదటివిడత 93,875 చోట్ల కల్లాల నిర్మాణం ప్రారంభమైంది.
గతంలో గ్రామ పంచాయతీలు కరంటు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో విద్యుత్ సంస్థలకు భారీ మొత్తంలో బకాయిలు పడాల్సిన పరిస్థితి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగా గ్రామ పంచాయతీలు కరంటు బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నది. ప్రతినెలా రూ.308 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్నది. దీనివల్ల గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధం లేకుండా కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇన్నిరకాల సౌకర్యాలు, వెసులుబాట్లు, పచ్చదనం, పరిశుభ్రత, పారదర్శక పద్ధతులు కలిగిన రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి లేదు. 

అవార్డులు – ప్రశంసలు 

తెలంగాణకు కేంద్ర ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌’ అవార్డు (20 నవంబర్ 2019)

మెరుగైన పారిశుద్ధ్య విధానాల అమలు, ఫలితాల సాధనకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్రానికి 2019 ఏడాదికిగాను కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ అవార్డు దక్కింది. 20 నవంబర్ 2019న ఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి సదానందగౌడ చేతుల మీదుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఈ అవార్డును అందుకున్నారు.
పల్లె ప్రగతిలో ముక్రా(కే) గ్రామానికి కేంద్రం ప్రశంసలు (7.2.2021) అందించింది.

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకున్నది. పల్లెప్రగతి కార్యక్రమాలతోపాటు సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలుచేస్తూ అభివృద్ధిలో పరుగులు తీస్తున్నది. ఈ నేపథ్యంలో ముక్రా (కే) గ్రామం 7 ఫిబ్రవరి 2021న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ నుంచి అభినందనలు పొందింది. గ్రామంలో నిర్మించిన సెగ్రిగేషన్‌ షెడ్‌లో 38 క్వింటాళ్ల సేంద్రియ ఎరువును తయారు చేసి విక్రయించగా.. పంచాయతీకి రూ.4 లక్షల వరకు ఆదాయం సమకూరింది.  దీంతో ముక్రా(కే) ఆర్థిక ప్రగతి సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నదని, ఇతర పంచాయతీలు కూడా ఈ దిశగా చర్యలు తీసుకోవాలని జల్‌శక్తి మంత్రిత్వశాఖ ట్వీట్‌ చేసింది.

పట్టణ ప్రగతి

రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో పట్టణీకరణ శరవేగంగా జరుగుతున్నది. ఇందుకు సరిపడా  మౌలిక సదుపాయాలు కల్పించి, వాటిని మరింత మెరుగు పర్చేందుకు ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పట్టణ నివాసాలన్నీ పచ్చదనం, పారిశుధ్య పనులతో పరిశుభ్రంగా విలసిల్లాలని భావించి, 2020 ఫిబ్రవరి 24న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
రాష్ట్రవ్యాప్తంగా నగరాల్లోని 13 కార్పొరేషన్లు, పట్టణ ప్రాంతాల్లోని 128 మున్సి పాలిటీల్లో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాలు పది రోజులపాటు కొనసాగాయి.ఈ పనుల ద్వారా నగరాలు, పట్టణాల్లోని ప్రతీ మూల, సందును అభివృద్ధి చేయడం జరిగింది. సౌకర్యవంతమైన పట్టణ నివాస కల్పనల దిశగా ఇది గట్టి పునాదిని ఏర్పరిచింది.

పట్టణ ప్రగతి సైన్యం భాగస్వామ్యం

పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో నిర్దేశించిన లక్ష్యాల సాధన కోసం ప్రణాళికలు రూపొందించారు.
మొత్తంగా 13 కార్పొరేషన్లలోని 661 మంది కార్పొరేటర్లు, 128 మున్సిపాలిటీల్లోని 2,945 వార్డు కౌన్సిలర్లు, 13,620 ప్రజా సంఘాలు, 2,04,300 మంది పౌరులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీరంతా పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావడంతో పట్టణ ప్రగతి విజయవంతమైంది. పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాల రూపురేఖలు మారిపోతున్నాయి. అన్ని మున్సిపాలిటీల్లో పచ్చదనం – పరిశుభ్రత పెంచడానికి తీసుకుంటున్న చర్యలు,  ప్రజలకు మౌలిక సదుపాయాలు రూపకల్పనతో లక్ష్యాలు ఫలిస్తున్నాయి. పట్టణాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రభుత్వం ప్రతీ యేటా రూ. 148 కోట్లు విడుదల చేస్తున్నది. జిహెచ్ఎంసి, ఇతర కార్పొరేషన్లకు అదనంగా నిధులు కేటాయిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *