డ్రగ్స్ ను నియంత్రించే దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి : సీఎం కేసీఆర్
డ్రగ్స్ ను నియంత్రించే దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి : సీఎం కేసీఆర్
పోలీస్ అధికారులు నేరాలను నిరూపించేందుకు చేపట్టవలసిన చర్యలు, సమకూర్చవలసిన వసతులను ఏర్పాటు చేయాలనీ, ఇందుకు తగు చర్యలు చేపట్టాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. సినిమా, సోషల్ మీడియా, తదితర సాంస్కృతిక వేదికలు ఆన్లైన్ వేదికల మూలాన కూడా డ్రగ్స్ వాడకం పెరిగిపోతున్నదని ఈ సందర్భంగా అధికారులు సీఎం కు వివరించారు.
ఈ సందర్భంగా సీఎం కెసీఆర్ మాట్లాడుతూ ..
” డ్రగ్స్ ను నియంత్రించే దిశగా ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ప్రజా సంబంధాల వ్యవస్థలను మెరుగపరచాలి., మీడియా, సినిమా మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకోవాలి. డ్రగ్స్ నియంత్రించే దిశగా నిర్మించే సినిమాలు, డాక్యుమెంటరీలు, అడ్వర్టైజ్మెంట్లకు సబ్సిడీలు అందించి ప్రోత్సహించాల’’ ని అధికారులను సీఎం ఆదేశించారు.
నైజీరియా వంటి దేశాల నుంచి వచ్చి నేరాలకు పాల్పడుతున్న వ్యవస్థీకృత నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించాలని డిజిపి ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వారిని నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. ఆయా దేశాల నుంచి వచ్చి ఇక్కడ నేరాలకు పాల్పడుతున్న విదేశీయులను గుర్తించి వెంటనే వారి వారి దేశాలకు పంపించాలన్నారు. అందుకు సంబంధించి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో గంజాయి తదితర నార్కొటిక్ డ్రగ్స్ వినియోగం, వాటి మూలాలను గుర్తించి కఠినంగా నియంత్రించాలని సంబంధిత పోలీస్ కమిషనర్లకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి, సరిహద్దుల్లోంచి అక్రమంగా రవాణా అవుతున్న గంజాయి తదితర మాదక ద్రవ్యాల నెట్ వర్క్ ను గుర్తించి కఠినంగా నిర్మూలించాలన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా నెట్ వర్క్ ను దాని సాంద్రతను లోతుగా అధ్యయనం చేసి నియంత్రణ కార్యాచరణ అమలుచేయాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. డ్రగ్స్ నియంత్రించే విషయంలో రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారుల నడుమ సమన్వయం సాధించాలన్నారు. అన్ని రకాల డ్రగ్ కంట్రోల్ విభాగాలను బలోపేతం చేయాలన్నారు. మూసివేసిన పరిశ్రమలు తదితర ఫ్యాక్టరీలు డ్రగ్స్ తయారీ పంపిణీ కేంద్రాలకు నెలవులుగా మారుతున్నాయని అధికారులు చేసిన సూచన పట్ల సీఎం ఘాటుగా స్పందించారు. తక్షణమే అటువంటి ‘క్లోజ్డ్ ఇండస్ట్రీ’లను గుర్తించి రూపుమాపాలని సీఎం స్పష్టం చేశారు.
రాష్ట్రంలో హుక్కా సెంటర్లనే మాటే వినపడకూడదని సిఎం అన్నారు.
రాష్ట్ర పోలీసులు కానీ, ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్ అధికారులు సిబ్బంది కానీ, డ్రగ్స్ వ్యవహారంలో తలదూర్చినట్లు తేలితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో నడుస్తున్న పబ్బులు, బార్లు సంబంధిత కేంద్రాల్లో డ్రగ్స్ వినియోగం పై దృష్టి సాధించాలని, అలాంటి వాటిని గుర్తించి వెంటనే లైసెన్స్ లు రద్దు చేయాలని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న పబ్స్ ను గుర్తించాలని, పబ్స్ యజమానులందరినీ పిలిపించి సమావేశం ఏర్పాటు చేసి వారికి ఖశ్చితమైన ఆదేశాలివ్వాలని డిజిపిని సీఎం ఆదేశించారు. తాను తరచుగా ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహిస్తానని, ఎటువంటి అలసత్వం లేకుండా అప్రమత్తతతో పనిచేయాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. బార్లల్లో, పబ్స్ ల్లో డ్రగ్స్ వాడకం జరుగుతున్నట్లు తెలిస్తే సంబంధిత ఎక్సైజ్ అధికారులు సిబ్బంది మీద కఠిన చర్యలు తప్పవని సీఎం స్పష్టం చేశారు. . లంచాలు తీసుకొని పనిచేసే ఎక్సైజ్ శాఖ సిబ్బందిపై కఠినచర్యలుంటాయని సీఎం హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ నుంచి డ్రగ్స్ కేసుల వివరాలను తెప్పించుకోవాలని, ఫారెస్టుల్లో సాగవుతున్న గంజాయి వివరాలను గుర్తించాలన్నారు. నార్కోటిక్ కేసుల విచారణలో ప్రభుత్వ అడ్వకేట్లు కొందరు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, డ్రగ్స్ కేసులు వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ల నియామకంలో నిబద్ధత కలిగిన వ్యక్తులను నియమించాలని సీఎం స్పష్టం చేశారు. ఎఫ్.ఎస్.ఎల్., ప్రాసిక్యూషన్ విభాగాలను బలోపేతం చేయాలన్నారు. పబ్బులు, బార్లల్లో పోలీసులు డీకామ్ ఆపరేషన్ చేపట్టాలని, డ్రగ్స్ ప్రోత్సహిస్తున్న పబ్బుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారుగుడుంబా తయారీలో ఇల్లీసిట్ లిక్కర్ నిర్మూలన చేపట్టాలని, గుడుంబా రహిత ప్రాంతాలుగా చేయాలని సీఎం అన్నారు. పేకాట తదితర వ్యవస్థీకృత నేరాలను సమూలంగా రూపుమాపాలన్నారు. ఎక్సైజ్ శాఖ లో సీఐ స్థాయిలో అధికారులను అప్రమత్తం చేయాలని క్షేత్రస్థాయిలో వారికి డ్రగ్స్ నేరాలపై అవగాహన ఉంటుందని, నిజాయితీగా పనిచేసేవారికి ఆక్సిలేషన్ ప్రమోషన్స్ ఇవ్వాలని సీఎం తెలిపారు. యాజమాన్యాలను..డీఈవో లు తదితర విద్యాసంస్థలకు సంబంధించిన అధికారులను సమావేశపరచాలని జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ మెడికల్, పాలిటెక్నిక్, ఐటిఐ, ఇంటర్ తదితర కళాశాల యాజమాన్యాలను తదితర కాలేజీల్లో ప్రిన్సిపాల్స్ ను పిలిచి సమావేశాలు నిర్వహించి కౌన్సిలింగ్ చేసి డ్రగ్ర్ వినియోగం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టమైన సూచనలు చేయాలన్నారు.
డ్రగ్ ఫ్రీ గ్రామాలకు ప్రత్యేక ఫండ్స్ తో పాటు ఇన్సెంటివ్స్ ఇస్తామని సిఎం అన్నారు. గ్రామాల్లో గంజాయి సాగు కాకుండా చూసుకోవాల్సిన బాద్యత ఆయా గ్రామస్తులమీద కూడా వున్నదన్నారు. 5 సార్లకు మించి గంజాయి దొరికితే ఆ ఊరికి ప్రభుత్వం అన్ని రకాల సబ్సిడీలను రద్దు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ దిశగా గ్రామ సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేయండి. సోషల్ మీడియా ద్వారా కూడా డ్రగ్స్ దందా నడుస్తుందనే విషయం పరిశీలనలో తేలిందని దాని మీద కూడా దృష్టి సారించాలని సీఎం సూచించారు. జిల్లాల వ్యాప్తంగా ఎస్పీలు, డిసిపి లు, కమిషనర్లు తరచుగా ప్రెస్ కాన్ఫరెన్స్ లు నిర్వహించాలని సీఎం సూచించారు. డ్రగ్ నేరస్థుల రికార్డు మెయింటేన్ చేసి పదే పదే నేరాలకు పాల్పడుతున్న వారిపై పి.డి. యాక్ట్ లు పెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల విచారణలో భాగంగా నిందితులను తీసుకోని కోర్టులకు వెళ్లిన పోలీసులు వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని వారికి ప్రత్యేక రూంలను వసతులతో ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. హైద్రాబాద్ మహానగరం పరిధిలోని ముగ్గురు పోలీస్ కమిషనర్లు, నగర గొప్పతనాన్ని పాడుకాకుండా చూసుకోవాలన్నారు. వరంగల్, కరీంనగర్ వంటి సిటీలు అభివృద్ధి పథాన పయనిస్తున్నాయని వాటిని వ్యవస్థీక్రుత నేరాల బారిన పడకుండా చూసుకోవాలన్నారు.
ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ లో అగ్గి కణికలు లాంటి అధికారులు కావాలన్నారు.గుడుంబా మీద.. ఇల్లీసిట్ లిక్కర్, డ్రగ్స్ మీద కఠినంగా వ్యవహరించాలన్నారు. ‘తెలంగాణ ఆర్గనైజ్డ్ క్రైం యాక్ట్’ ను తిరిగి అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, అందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని చేపట్టాలని డిజిపి ని సిఎం ఆదేశించారు.