జాతిపిత సేవలు అజరామరం
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్
జాతిపిత మహాత్మా గాంధీ దేశానికి అందించిన సేవలు అజరామరమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. గాంధీజీ వర్థంతి సందర్భంగా రాజ్ భవన్ ఆదివారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో నాటి యోధుల సేవలు గుర్తు చేసుకోవాలన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో పరాయి పాలన నుండి మాతృభూమిని రక్షించేందుకు జాతిపిత చేసిన కృషి ఎనలేనిదని ప్రస్తుతించారు. అమవీరుల దినోత్సవం సందర్భంగా తమ ప్రాణాలను త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు సైతం దేశం నివాళులర్పిస్తుందన్నారు.బ్రిటిష్ పాలన నుండి దేశాన్ని విముక్తి చేయాలన్న లక్ష్యంతో గాంధీజీ నేతృత్వంలో సాగిన సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం తదితర ఉద్యమాలు రక్తపాత రహితంగా సాగాయన్నారు.
మహాత్మా గాంధీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా శాసనోల్లంఘన ఉద్యమానికి నాయకత్వం వహించారని, ఉప్పుపై పన్నుకు నిరసనగా సబర్మతీ ఆశ్రమం నుండి గుజరాత్‌లోని దండి వరకు పెద్ద సంఖ్యలో ప్రజలను నడిపించారన్నారు. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి గాంధీజీ చేసిన కృషి మాటల్లో వర్ణించ లేమన్న గవర్నర్ , శాంతియుత విధానాల ద్వారా విజయం సాధించారని వివరించారు. గాంధీజీ సందేశాలు దేశంలోని మిలియన్ల ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయన్నారు.
ప్రబలంగా వ్యాపిస్తున్న ఓమిక్రాన్ వేరియంట్‌పై మరింత అప్రమత్తంగా ఉండాలని గౌరవ గవర్నర్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసారు. కుటుంబ సభ్యుల భద్రత దృష్ట్యా, వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, సముచిత ప్రవర్తనకు కట్టుబడాలన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.