గ్రీన్ఇండియా చాలెంజ్‌లో మొక్కలు నాటిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు
హైదరాబాద్:
బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్, తెలంగాణ ప్లేయర్ పీవీ సింధు గ్రీన్ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు.హైదరాబాద్ గచ్చిబౌలీ స్టేడియంలో తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బాడ్మింటన్ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, భారత హ్యాండ్హాల్ సమాఖ్య (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్ రావు, సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీ సింధుతో పాటు పలువురు గచ్చిబౌలీ మైదానంలోని ఆవరణలో మొక్కలు నాటారు. సింధు సహా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన షట్లర్ సాయిప్రణీత్, బ్యాడ్మింటన్ కోచ్ లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నెల 23వ తేదీ నుంచి జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో దేశం తరఫున బరిలోకి దిగనున్న భారత అథ్లెట్లకు బెస్ట్ ఆఫ్ లక్ చెబుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, శాట్స్ కోచ్ లు నందకిషోర్ గోకుల్ యాదవ్, రవీందర్, చంద్రారెడ్డి ధనలక్ష్మి పాల్గొన్నారు. టోక్యో విశ్వక్రీడల్లో పాల్గొననున్న అథ్లెట్లకు దేశమంతా మద్దతు తెలపాలని హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అన్నారు. ఒలింపిక్స్‌లో మన ప్లేయర్లు సత్తాచాటి, ఎక్కువ పతకాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.