కొత్త పిఆర్సి ప్రకారం ప్రతి ఉద్యోగికి జీతం పెరుగుతుంది తప్ప తగ్గుదల ఉండదు: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ

ఉద్యోగులు ఆందోళనను విరమించి మంత్రుల కమిటీతో చర్చలకు రావాలి

పరస్పర చర్చలు ద్వారానే సమస్యలు,అపోహలు తొలగుతాయి

ఉద్యోగులంటే ప్రభుత్వంలో భాగం-ప్రభుత్వం మీవెంటే ఉంది

కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆందోళన విరమించాలి ఉద్యోగుల కుటుంబ పెద్దగా విజ్ణప్తి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ

అమరావతి,1 ఫిబ్రవరి:కొత్త పిఆర్సి ప్రకారం ఉద్యోగుల జీతం పెరుగుతుంది తప్ప తగ్గుదల అనేది లేదని కావున ఉద్యోగులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలను విరమించి మంత్రుల కమిటీతో చర్చలకు రావాలని స్టీరింగ్ కమిటీ సభ్యులను ఉద్యోగుల కుటుంబ పెద్దగా విజ్ణప్తి చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ పేర్కొన్నారు.మంగళవారం అమరావతి సచివాలయం 5వ బ్లాకులో ఆర్ధికశాఖ అధికారులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త పిఆర్సి ప్రకారం ప్రతి ఉద్యోగికి జీతం పెరుగుతుంది తప్ప తగ్గుదల అనేది ఉండదని స్పష్టం చేశారు.దీనిని ప్రతి ఉద్యోగి తన డిశంబరు నెల పేస్లిప్ తో జనవరి నెల కొత్త పిఆర్సి పేస్లిప్ తో సరిచూసుకుంటే ఎంత పెరుగుదల ఉందో స్పష్టంగా తెలుస్తుందని అన్నారు.ఉద్యోగులంటే ప్రభుత్వంలో భాగమని ప్రభుత్వం ఉద్యోగుల వెంటే ఉందని కావున పరస్పర చర్చలు ద్వారానే అన్ని అంశాలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు.ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగుల ఆందోళన కార్యక్రమాలతో ప్రజలు మరిన్ని ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉండటం తోపాటు ఆర్ధిక వ్యవస్థ కూడా ఇంకా క్షీణించే అవకాశం ఉందని చెప్పారు.సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం సరాసరిన 60వేల నుండి 62వేల కోట్ల రూపాయలుగా ఉండగా యేటా 15శాతం పెరుగుదల ఉండాలి కాని కరోనా పరిస్థితుల వల్ల గత రెండేళ్ళలో 15వేల నుండి 20వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయామని చెప్పారు.అయినప్పటికీ 23శాతం ఫిట్మెంట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. కావున ఆందోళన విరమించి మంత్రుల కమిటీతో చర్చలకు రావాలని సిఎస్ డా.సమీర్ శర్మ పునరుద్ఘాటించారు.
ఉద్యోగులకు సంబంధించిన పదవీ విరమణ వయస్సును 60నుండి 62 యేళ్ళకు ఇప్పటికే పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ చెప్పారు.దానివల్ల ఉదాహరణకు ఒక ఉద్యోగి నెలకు లక్ష రూ.లు జీతం తీసుకుంటే అతనికి రెండేళ్ళలో 24 లక్షల రూ.లు జీతంతోపాటు గ్రాట్యుటీ వంటి అదనపు ప్రయోజనాలు కలుగుతాయన్నారు.అంతేగాక ఎంఐజి ఇళ్ళకు సంబంధించి ఉద్యోగులకు 20శాతం రాయితీ కల్పించడం ఇతర ప్రయోజనాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ఎంత వరకూ చేయగలదో అంత వరకూ చేయగలిగింది.ఇంకా ఉద్యోగులకు సంబంధించిన ఇతర సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని కావున ఆందోళన విరమించి మంత్రుల కమిటీతో చర్చలకు రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఉద్యోగ సంఘాలకు మరొక సారి విజ్ణప్తి చేశారు.
ఈసమావేశంలో ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రతినెల 1వతేదీన జీతాలు చెల్లించడం అనేది ప్రభుత్వ బాధ్యతని అందుకే డిడిఓలు,ఎస్టిఓలు సహకారంతో జీతాల చెల్లింపునకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికే సుమారు 3లక్షల 53వేల మంది ఫించన్ దారులు,3లక్షల 97వేల మంది రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించిన జీతాల చెల్లింపునకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.అలాగే 3లక్షల 10వేల మంది గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగులకు,లక్షా 75వేల మంది ఆశా వర్కర్లు,అంగన్ వాడీ వర్కర్లు తదితరులకు,మరో 96వేల మంది పొరుగు సేవల ఉద్యోగులు, ఒప్పంద ఉద్యోగులకు జీతాలు వారి ఖాతాల్లో జమచేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి(హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగుల జీతాలు కొత్త పిఆర్సి ప్రకారం ఏవిధంగా పెరిగింది డిశంబరు నెల పేస్లిప్ ను జనవరి నెల కొత్త పిఆర్సి పేస్లిప్ తో బేరీజు వేసి వివరించారు. ఉద్యోగులు వారికి సంబంధించిన పెరిగిన జీతాల వివరాలను ఆర్ధికశాఖ వెబ్ సైట్ ద్వారా గాని లేక ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా గాని తెల్సుకోవచ్చని చెప్పారు.
ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ టి.విజయ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *