ఎస్ ఆర్ డి పి ప్రాజెక్టులో భాగంగా పూర్తయిన బాలానగర్ ఫ్లై ఓవర్… మంత్రి కేటీఆర్ చేతులమీదుగా బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభం
హైదరాబాద్/బాలానగర్:
దశాబ్దాల కాలం నుంచి బాలానగర్ ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించింది.స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నర్సాపూ ర్ చౌరస్తావద్ద బ్రిడ్జి నిర్మించాలని సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్‌ను నాలుగేళ్ల క్రితం ఒప్పించారు. 2017 ఆగష్టు 21న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
బాలానగర్ ఆంధ్రాబ్యాంకు నుంచి శోభనా బస్టాపు వరకు 1.13 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పు(ఆరులైన్లు)తో 24 పిల్లర్లతో ఫ్లై ఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బ్రిడ్జి నిర్మాణం కోసం మంజూరైన 387 కోట్ల నిధులలో రూ.122 కోట్లు బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం ఖర్చు చేయగా,ఆస్తుల సేకరణలో స్థలాలు, షాపులు కోల్పోయిన 355 మందికి 265 కోట్లు నష్ట పరిహారం చెల్లించారు.
బాలానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జికి పీజేఆర్ పేరు పెట్టాలని కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్ అని టీఆర్‌ఎస్ నాయకులు, ఇలా ఒక్కొక్కరు ఒక్కో పేరుతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు వినతి పత్రాలు అందించారు. బ్రిడ్జికి బాబు జగ్జీవన్ రామ్ పేరు పెట్టాలని, బ్రిడ్జి నిర్మాణం ప్రారంభ దశనుంచే దళితులు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారని, అందుకే బ్రిడ్జికి బాబుజగ్జీవన్ రామ్‌గా నామకరణం చేశారు.
స్థలాలు, ఆస్తులు కోల్పోతున్న వారు కోర్టుకు వెళ్లడం, కొవిడ్, లాక్‌డౌన్ కారణంగా బ్రిడ్జి పనులు కాస్త ఆలస్యమయ్యయి. ప్రభుత్వాలు, పార్టీ నాయకులు ఎందరో మారినా ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరకలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ నిధులు కేటాయించడంతో బ్రిడ్జి పూర్తి అయింది.
బాలానగర్ నర్సాపూర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండేది. ఒక్కోసారి ఇటు ఐడీపీఎల్, అటు శోభనా కాలనీ వరకు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతూ వచ్చేది. కానీ ఫ్లైఓవర్ నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడింది.